దైవానుగ్రహం ఇలా లభిస్తుంది !

అన్ని జన్మలలోకి మానవజన్మ మహోన్నతమైనది. భగవంతుడిని అర్చించడానికీ ... ఆరాధించడానికి ... కీర్తించడానికి ... సేవించడానికి మానవజన్మకి మాత్రమే అవకాశం వుంది. దైవానుగ్రహాన్ని సంపాదించుకుని ఉత్తమగతులు పొందడం మానవ జన్మలో మాత్రమే సాధ్యమవుతుంది. ఎన్నో పుణ్యకార్యాలు చేస్తేనే ఉత్తమమైన మానవజన్మ లభిస్తుంది.

అలా పొందిన ఈ మానవజన్మ ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగిపోవాలన్నా ... ఎలాంటి లోటు లేకుండా ముందుజన్మలు గడవాలన్నా అందుకు దైవానుగ్రహమే వుండాలి. అలాంటి అనుగ్రహాన్ని పొందడానికి చేసే పుణ్యకార్యాల్లో ఒకటిగా 'భూతదయ' చెప్పబడుతోంది. ప్రతిఒక్కరూ తోటివారితో పాటు, తన చుట్టూ వున్న ప్రాణులపట్ల దయా స్వభావాన్ని కలిగివుండాలి. చీమల దగ్గర నుంచి ఏనుగు వరకూ అన్నింటిపై కరుణ కలిగి వుండాలి.

చీమలకు పంచదార .. రవ్వ, అలాగే పక్షులకు ధాన్యం .. కుక్కలకు రొట్టెలు .. కోతులకు పండ్లు .. ఆవులకు గ్రాసం .. గుర్రాలకు దాణ .. ఇలా అన్నిరకాల జీవులకు తనకి చేతనైనంతలో ఆహారాన్ని అందిస్తూ వుండాలి. నిజానికి అన్ని జీవులకు ఆహారాన్ని అందించేవాడు ఆ పరమశివుడే. తనకి వున్న దాంట్లో ఇలా ఇతర జీవరాశికి ఆహారాన్ని ఏర్పాటుచేసే వాళ్లను చూసి ఆ సదాశివుడు సంతోషిస్తాడట.

అలాంటి వాళ్ల ద్వారా ఆయన మరిన్ని జీవరాసులకు ఆహారాన్ని సమకూరేలా చేస్తాడు. ఇలా సేవ చేసేవారికి ఎలాంటి ఆటంకాలు ఎదురుకాకుండా చూస్తాడు. ఈ జన్మలో అన్నివిధాలా ఆదుకోవడమే కాకుండా ఉత్తమగతులను కల్పిస్తాడు. ఇక ఇలా భూతదయను కలిగిన వారిపై శనిదేవుడు తన ప్రభావం చూపడని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. అలాగే ఇతర ప్రాణులపట్ల ప్రేమను కలిగినవారి ఇంట ఉండటానికి లక్ష్మీదేవి ఆసక్తి చూపుతుందని స్పష్టం చేయబడుతోంది. అందుకే ఏ ప్రాణికి ఎలాంటి హాని తలపెట్టకుండా వాటి పోషణకి తగిన సహాయం అందించాలి .. దైవానుగ్రహంతో మానవజన్మను సార్థకం చేసుకోవాలి.


More Bhakti News