మీనాక్షీ అమ్మవారికి చెప్పుకుంటే చాలు !

శివపార్వతులు లోకానికే ఆదిదంపతులు ... ఆదర్శదంపతులు. లోకకల్యాణ కారకమైన అనేక సందర్భాల్లో ఉమామహేశ్వరులు ఆయా ప్రాంతాల్లో ఆవిర్భవించారు. అలా పార్వతీపరమేశ్వరులు కొలువైన క్షేత్రాలు ఎంతో విశేషమైనవిగా ... మహిమాన్వితమైనవిగా ప్రసిద్ధిచెందాయి. స్వామివారు ... అమ్మవారు కొలువుదీరిన ఒక్కో క్షేత్రం ఒక్కో విశిష్టతను సంతరించుకుని విలసిల్లుతోంది. ఆదిదేవుడి లీలావిశేషాలకు నిలయంగా అలరారుతోంది.

అలాంటి క్షేత్రాల్లో తమిళనాడులోని మధురై ఒకటిగా చెప్పుకోవచ్చు. మధురై అనే మాట వినగానే అందరి నోటి వెంట వచ్చే తరువాత మాట మీనాక్షి అమ్మవారిదే. నిజం చెప్పాలంటే మధుర మీనాక్షి అనేది ఒక మాటలా కాకుండా మధురమైన మంత్రంగా అనిపిస్తుంది. ప్రేమతో పిలిచినదే తడవుగా అమ్మవారు గర్భాలయాన్ని దాటుకుని రావడానికి సిద్ధంగా ఉన్నట్టు కనిపిస్తుంది.

ఇక్కడ స్వామివారు సుందరేశ్వరుడుగా దర్శనమిస్తూ వుంటాడు. అడుగడుగునా శిల్పకళా శోభితమైన ఈ క్షేత్ర దర్శనం అమ్మవారి అనుగ్రహముంటే తప్ప లభించదని భక్తులు భావిస్తుంటారు. మీనాక్షీ అమ్మవారు ఇక్కడ కఠోరమైన తపస్సును చేసి సుందరేశ్వరస్వామిని భర్తగా పొందినట్టు స్థలపురాణం చెబుతోంది. ఫాల్గుణ పౌర్ణమి రోజున స్వామివారితో అమ్మవారి వివాహం జరిగిందట.

అమ్మవారి వివాహం జరిగిన ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడం వలన వివాహ యోగం కలుగుతుందనే విశ్వాసం బలంగా కనిపిస్తూ ఉంటుంది. వివిధ కారణాల వలన వివాహం విషయంలో ఆలస్యాన్ని ఎదుర్కుంటోన్నవాళ్లు, ఇక్కడి అమ్మవారిని దర్శించుకోవడం వలన ఎలాంటి ఆటంకాలైనా వెంటనే తొలగిపోయి అనతికాలంలోనే వివాహం జరిగిపోతుందని అంటారు. అందువలన వివాహం కావలసిన కన్యలు అమ్మవారిని ఎక్కువగా దర్శించుకుంటూ వుంటారు. మీనాక్షీ సుందరేశ్వరస్వామి ఆశీస్సులను అందుకుంటూ వుంటారు


More Bhakti News