లక్ష్మీదేవి మనసెరిగి నడచుకోవాలి
ధనమనేది ఏ రూపంగా వున్నా అది లక్ష్మీస్వరూపంగానే చెప్పబడుతోంది. అందుకే ధాన్యం ఇంటికి వచ్చినప్పుడు కూడా లక్ష్మీదేవి వచ్చినట్టుగానే భావిస్తుంటారు. ధనాన్ని పవిత్రమైన ప్రదేశంలో ఉంచుతుంటారు. లక్ష్మీరూపంగా స్తుతిస్తూ పూజిస్తుంటారు. అలాగే ధాన్యాన్ని కూడా గాదెల్లో నిల్వచేస్తుంటారు.
ధనధాన్యాలతో గల ఇల్లు లక్ష్మీదేవి నిలయంగా కళకళలాడుతూ కనిపిస్తుంది. అలా కనిపించడానికి కారణం పూర్వజన్మలో చేసుకున్న పుణ్యఫలితమే. ఎవరి ఇంటనైతే ధనధాన్యాలు ఉంటాయో వారి పట్ల లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్నట్టుగా తెలిసిపోతూ వుంటుంది.
అలాగే గోవు కూడా లక్ష్మీదేవి స్వరూపంగా చెప్పబడుతోంది. అందుకే అంతా 'గోమాలక్ష్మి' అని ప్రేమతో పిలుచుకుంటూ వుంటారు. గోవుకు పసుపురాసి కుంకుమ దిద్ది పూజిస్తూ వుంటారు. అలాంటి గోసంపద కలిగినవారికి కూడా లక్ష్మీదేవి కటాక్షం ఉన్నట్టుగా అర్థమవుతుంది. అయితే ధనమైనా ... ధాన్యమైనా ... గోవులైనా ఎంతో అపురూపంగా చూసుకున్నంత వరకే ఉంటాయనీ, వాటిపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అవి దూరమవుతాయని అంటారు. ఎందుకంటే వీటిని అపురూపంగా చూసుకునే చోటున ఉండటానికే లక్ష్మీదేవి ఆసక్తి చూపుతుందట.
ధనమైనా ... ధాన్యమైనా కొంత భగవంతుడి కోసం .. అర్హత కలిగినవారికి దానం చేయడం కోసం కొంత కేటాయించి, మిగతాది అవసరాన్ని బట్టి పొదుపుగావాడుతూ వుండాలి. అలా కాకుండా నిర్లక్ష్య ధోరణితో దూబరాగా ఖర్చుచేసే వారికీ .. గోవులను కష్టపెట్టే వారికీ లక్ష్మీదేవి దూరంగా వెళుతుందని చెప్పబడుతోంది. అందువలన ఈ విషయంలో నిర్లక్ష్య ధోరణిని వెంటనే వదిలేయాలి. ధనధాన్యాలకు విలువనిస్తూ .. గోవులను సదాపూజిస్తూ లక్ష్మీదేవి స్థిరనివాసం చేసేలా మసలుకోవాలి.