శివకేశవ సంబంధమైన ఫాల్గుణ పౌర్ణమి
హోలీ అంటే రంగులపండుగ ... జీవితంలోని సంతోషాలకీ ... సంబరాలకి రంగులు సంకేతంగా చెబుతుంటారు. ఈ రోజున ఏవీధిలో చూసినా రంగులు ... రంగు కలిపిన నీళ్లు చల్లుకుంటూ వుంటారు. పిల్లలతో పాటు పోటీపడుతూ పెద్దలు కూడా ఈ పండుగలో ఉత్సాహంగా పాల్గొంటూ వుంటారు. ఒకరిపట్ల ఒకరికి గల ప్రేమాభిమానాలను ఆవిష్కరించేదిగా ఈ పండుగ కనిపిస్తూ వుంటుంది.
ఉత్సాహానికి ఉదాహరణగా కనిపించే ఈ 'ఫాల్గుణ పౌర్ణమి' శివకేశవుల లీలావిశేషాలకు వేదికగా అనిపిస్తుంది. ధర్మసంస్థాపనార్థం శ్రీమన్నారాయణుడు కృష్ణుడుగా జన్మించాడు. అలా జన్మించిన చిన్నికృష్ణుడిని ఈ రోజునే ఊయలలో వేసినట్లు ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఈ కారణంగానే కొన్నిప్రాంతాల్లో ఈ రోజున బాలకృష్ణుడికి 'డోలోత్సవం' పేరుతో వేడుక జరుపుతుంటారు. పసివాడైన పరమాత్ముడిని ఊయలలో ఊపే ఈ ఉత్సవం నయన మనోహరంగా ఉంటుంది.
ఇక ఫాల్గుణ శుద్ధ చతుర్దశి రోజున తనపై మన్మథ బాణాలు సంధించిన మన్మథుడిని పరమశివుడు తన మూడవ కంటితో దహించివేస్తాడు. లోకకల్యాణం కోసమే తన భర్త ఆ పని చేసినట్టు మన్మథుడి భార్య రతీదేవి మొరపెట్టుకోగా, ఇకమీదట శరీరం లేనివాడిగానే ఆయన తిరుగుతాడంటూ ఫాల్గుణ పౌర్ణమి రోజున పునర్జీవితుడిని చేస్తాడు. ఈ ఆనందంతోనే ఈ రోజుని 'కాముని పున్నమి' పేరుతో జరుపుకుంటూ .. రంగులు చల్లుకుంటూ వుంటారు.
ఇలా ఫాల్గుణ పౌర్ణమి శివకేశవ సంబంధమైనదిగా కనిపిస్తుంది. అందువల్లనే ఈ రోజున సదాశివుడినీ ... కృష్ణ భగవానుడిని పూజించాలని చెప్పబడుతోంది. ఈ విధంగా చేయడం వలన సకల శుభాలు చేకూరతాయని స్పష్టం చేయబడుతోంది.