కోరికలు నెరవేర్చే సుందరేశ్వరస్వామి
శ్రీమహావిష్ణువును ఆరాధించేవారు పరమశివుడి ప్రీతికి కూడా పాత్రులవుతుంటారు. సదాశివుడిని పూజిచేవారు ఆ నారాయణుడి అనుగ్రహాన్ని సైతం పొందుతుంటారు. వేదాలు చదవకపోయినా ... శాస్త్రాల సారం తెలియకపోయినా ఆ ఇద్దరూ ఒక్కటేననే భావనతో ఆరాధిస్తే చాలు, దక్కని పుణ్యం లేదు ... పొందని ఫలితం లేదు.
ఈ నేపథ్యంలో శివుడు కొలువైన ప్రాంగణంలో విష్ణువు ... విష్ణువు వెలసిన ప్రదేశంలో శివుడు ఆవిర్భవించిన క్షేత్రాలు ఎన్నో వున్నాయి. శివకేశవులు ఒకే ప్రదేశంలో కొలువైన క్షేత్రాలు విశేషమైనవిగా వెలుగొందుతున్నాయి. ఇక శివకేశవులు స్వయంభువులుగా ఆవిర్భవించిన క్షేత్రాలు మరింత విశిష్టమైనవిగా .. మహిమాన్వితమైనవిగా చెప్పబడుతున్నాయి.
అలాంటి క్షేత్రాల్లో ఒకటిగా 'చిలుకూరు' కనిపిస్తుంది. హైదరాబాద్ - మెహదీపట్నం సమీపంలో ఈ క్షేత్రం విలసిల్లుతోంది. చిలుకూరు బాలాజీ అంటే తెలియనివారుండరు. అంతటి ప్రసిద్ధిని పొందిన దివ్యక్షేత్రం ఇది. అలాంటి ఈ ఆలయ ప్రాంగణంలోనే ఒక రావిచెట్టు కింద 'సుందరేశ్వరుడు' పేరుతో పరమశివుడు దర్శనమిస్తుంటాడు. వేంకటేశ్వరస్వామి మాదిరిగానే శివుడు కూడా ఒక భక్తుడి కోసం ఇక్కడ ఆవిర్భవించినట్టు స్థలపురాణం చెబుతోంది.
స్వామివారికి నీడను ఇచ్చే ఇక్కడి రావిచెట్టును చాలాకాలం క్రితం ఒక వ్యక్తి గొడ్డలితో కొట్టబోగా, శివుడు ఆగ్రహావేశాలను వ్యక్తం చేసినట్టు చరిత్ర చెబుతోంది. అందువలన సదాశివుడు ఇక్కడ ప్రత్యక్షంగా కొలువై ఉన్నట్టుగా చెబుతుంటారు. బాలాజీని దర్శించుకున్న అనంతరం భక్తులు శివయ్యను కూడా దర్శించుకుంటూ వుంటారు. మనసులోని మాటను చెప్పుకుని ఆయన అనుగ్రహాన్ని కూడా పొందుతుంటారు.
వేంకటేశ్వరుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు ... ఇక రావిచెట్టు కూడా నారాయణుడి స్వరూపంగా చెప్పబడుతోంది. అలాంటి నారాయణుడి సన్నిధిలో వెలసిన శివయ్యను దర్శించడం భక్తులకు అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుంది. స్వయంభువులుగా ఆవిర్భవించిన హరిహరులను సేవించిన సంతృప్తి లభిస్తుంది.