అండదండగా నిలిచే ఆంజనేయుడు
భయమనేది మనిషిని ముందడుగు వేయకుండా అడ్డుకుంటూ వుంటుంది. అనేక రకాల సంశయాలకి గురిచేస్తూ, ఏ పనిని ఆరంభించకుండా చేస్తూవుంటుంది. చీకటిలో ఒంటరిగా నడుస్తున్నప్పుడు హఠాత్తుగా ఏదైనా అలికిడి వినిపిస్తే, శ్రీఆంజనేయం .. ప్రసన్నాంజనేయం అంటూ వచ్చినంత వరకూ దండకం చదువుకుంటూ అడుగులు ముందుకువేస్తారు. వెలుగులోకి రాగానే హమ్మయ్య అని తేలికగా ఊపిరిపీల్చుకుంటూ వుంటారు.
ఇలా ఒక్కొక్కరికి ఒక్కో విషయమై భయమనేది వుంటుంది. అలాంటి అన్ని భయాలకు విరుగుడుగా హనుమంతుడి నామస్మరణ చెప్పబడుతోంది. ఆయన కొలువైన క్షేత్రాలు కూడా దుష్టశక్తులను తరిమేసేవిగానే కనిపిస్తుంటాయి. అలాంటి క్షేత్రాల్లో ఒకటిగా 'తుంగపాడు' అలరారుతోంది. నల్గొండ జిల్లా త్రిపురారం మండలం పరిధిలో ఈ క్షేత్రం విలసిల్లుతోంది.
ఇక్కడి గుట్టపై కొన్ని వందల సంవత్సరాల క్రితమే హనుమంతుడు వెలిశాడట. అప్పటి నుంచి గిరిజనులు స్వామిని తమ ఇలవేల్పుగా భావించి పూజిస్తూ వస్తున్నారు. తమని కాపాడుతున్నది ఈ స్వామియేనని చెబుతుంటారు. కొంతకాలం క్రితమే అంతాకలిసి స్వామికి ఆలయాన్ని నిర్మించారు. అప్పటి నుంచి స్వామివారిని పరిసర ప్రాంతాల్లోని గ్రామస్తులు సైతం దర్శిస్తున్నారు.
ఇక్కడి స్వామిని పూజించడం వలన మానసికపరమైన .. శారీరక పరమైన వ్యాధులు నివారించబడతాయని చెబుతుంటారు. స్వామి స్వయంభువుగా ఆవిర్భవించిన ఈ ఆలయాన్ని ఒక్కసారి దర్శించినా ఇక దుష్టశక్తులు దరిచేరలేవని అంటారు. ఎత్తైన ఈ గుట్టపై నుంచి పరిసరప్రాంతాలు ఎంతో అందంగా కనిపిస్తూ కనువిందు చేస్తుంటాయి. ప్రశాంతతను ప్రసాదించే ఇక్కడి ప్రకృతి సౌందర్యాన్ని తిలకిస్తూ కూర్చుంటే సమయం తెలియదు. ఆహ్లాదాన్నీ ... ఆధ్యాత్మిక శక్తిని అందించే ఈక్షేత్ర దర్శనం మనోఫలకంపై ఎప్పటికీ నిలిచిపోతుంది.