మనసును ఊయలలూపే మంటపం !

ప్రాచీన క్షేత్రాలకి వెళ్లినప్పుడు, ఆలయ ఆవరణలో పెద్ద మంటపం కనిపిస్తూ వుంటుంది. దీనిని కల్యాణ మంటపంగా పిలుస్తుంటారు. ఏడాదికి ఒకసారి అక్కడి దైవానికి జరిపే కల్యాణమహోత్సవం ఈ మంటపంలో అంగరంగవైభవంగా జరుపుతుంటారు. ఎత్తయిన వేదిక ... శిల్పకళా శోభితమైన స్తంభాలు ... తీర్చిదిద్దబడిన పైకప్పుతో ఈ మంటపాలు ఎంతో విశాలంగా .. అందంగా కనిపిస్తుంటాయి.

మంటపానికి ముందుభాగంలో మూడువైపులా కూర్చున్న భక్తులకు స్వామివారి కల్యాణోత్సవం చక్కగా కనిపిస్తూ వుంటుంది. ఇప్పటికీ ప్రాచీనకాలంనాటి మంటపాల్లోనే కొన్ని క్షేత్రాలలో కల్యాణోత్సవాన్ని నిర్వహిస్తుంటారు. ఈ తరహా మంటపాలు గ్రామస్థాయిలో గల కొన్ని ప్రాచీన ఆలయాల ఆవరణలోను కనిపిస్తుంటాయి.

ఇక పొడవైన నాలుగు స్తంభాలు కలిగిన మంటపాలు మాత్రం ప్రాచీన క్షేత్రాల్లోనే కనిపిస్తూ వుంటాయి. ఈ మంటపాలు విశాలంగా కాకుండా ఎక్కువ ఎత్తును కలిగి, పైన చిన్నపాటి శిఖరాన్ని కలిగినవిగా దర్శనమిస్తుంటాయి. ఆలయ ఆవరణలో గల ఈ మంటపం దగ్గర ఇప్పుడు ఎక్కువ సందడి కనిపించదు కనుక, ఇది ఎందుకు నిర్మించబడిందోననే సందేహం కొంతమంది భక్తులు కలుగుతూ వుంటుంది.

దీనిని 'ఊయల మంటపం' అని అంటారు. పూర్వం ఈ మంటపాల్లోనే స్వామివారికి 'ఊయల సేవ' ( డోలోత్సవం) జరిపేవారు. అందుకే ఈ మంటపం ఊయల ఊపడానికి ... మూడువైపులా కూర్చున్న భక్తులు తిలకించడానికి అనుకూలంగా నిర్మించబడి కనిపిస్తుంది. అలనాటి వేడుకలను ఊహించుకుంటే ఇది మనసును ఊయలలూపే మంటపంగా కనిపిస్తుంది.

కాలక్రమంలో భక్తుల రద్దీ పెరిగిన దృష్ట్యా కొన్ని క్షేత్రాల్లో ఇప్పుడీ మంటపాలను ఉపయోగించకపోవడం జరుగుతోంది. అందువల్లనే ఈ మంటపం దేనికోసం ? అన్నట్టుగా భక్తులు ఈ రోజుల్లో ఆశ్చర్యంగా చూస్తుంటారు. ప్రాచీన క్షేత్రాల్లో గల కల్యాణమంటపమైనా .. ఊయల మంటపమైనా ఆనాటి వైభవానికి అద్దంపడుతుంటాయి. అప్పట్లో భక్తజనం వాటి చుట్టూ కూర్చుని స్వామివారి వైభవాన్ని తిలకిస్తోన్న మనోహరమైన దృశ్యాన్ని కళ్లకు కడుతుంటాయి.


More Bhakti News