గురువు అనుగ్రహానికి అసాధ్యమైనది లేదు
భగవంతుడు అప్పగించిన బాధ్యతలను నిర్వహించేవారిగా గురువులు కనిపిస్తూ వుంటారు. గురువులు సమాజంలోని మనుషుల మధ్య సఖ్యతను పెంపొందింపజేస్తూ ... మానవత్వాన్ని మేల్కొల్పుతూ ... ఆధ్యాత్మిక భావాలను వెదజల్లుతూ వుంటారు. మానవులంతా హింసా ప్రవృత్తికి దూరమై ప్రశాంతమైన వాతావరణంలో సుఖంగా జీవించేలా కృషిచేస్తుంటారు. సున్నితంగా ... మితంగా మాట్లాడుతూనే తమచుట్టూ ఉన్నవారిని ప్రభావితం చేస్తుంటారు.
ఆదిశంకరాచార్యులు ... రాఘవేంద్రస్వామి ... దత్తాత్రేయుడు .. శ్రీపాద శ్రీవల్లభులు ... శ్రీ నృసింహ సరస్వతి ... మాణిక్య ప్రభు ... అక్కల్ కోటస్వామి ... శిరిడీ సాయిబాబా ఇలా ఎంతోమంది మహానుభావులు గురువులుగా ఆధ్యాత్మిక ప్రపంచాన్ని ప్రభావితం చేశారు. వీళ్లంతా కూడా నిస్వార్థమైన జీవితాన్ని కొనసాగిస్తూనే అనేక మహిమలను చేసి చూపారు.
ఆపదలో ఉన్నవారిని ఆదుకున్నారు ... అవసరాల్లో ఉన్నవారికి సహాయం చేశారు. ఎండిపోయిన బావిలో నీరు ఊరేలా ... వట్టిపోయిన ఆవు పాలను ఇచ్చేలా చేశారు. ఒకరు రజకుడిని రాజును చేస్తే ... మరొకరు అక్షరజ్ఞానంలేని వ్యక్తికి 'దివాను' పదవి లభించేలా చేశారు. కొందరు స్పర్శమాత్రం చేత అంగవైకల్యాన్ని పోగొడితే, మరికొందరు దారిద్ర్యంతో బాధపడుతోన్నవారికి విముక్తిని కల్పించారు.
సంవత్సరాలతరబడి అధ్యనం చేసినా అబ్బని శాస్త్ర పరిజ్ఞానాన్ని, అక్షరజ్ఞానం లేనివారికి ఒకే ఒక్క చూపుతో ప్రసాదించిన ఘనత గురువులకే చెందుతుంది. ఇష్టదైవాన్ని చూడాలనుకునే భక్తుల మనసు తెలుసుకుని, ఆ రూపంలో వాళ్లకి దర్శనమిచ్చారు. గురువు పట్ల పరిపూర్ణమైన విశ్వాసంతో ఆయన పాదాలను ఆశ్రయించాలే గాని ఆయనకి సాధ్యం కానిది లేదు ... ఆయన అనుగ్రహానికి తిరుగులేదనే విషయం స్పష్టమవుతూ వుంటుంది.