వరాలు కురిపించే పంచముఖ హనుమ

హనుమంతుడు మహాబల సంపన్నుడు. దేవతల ఆశీస్సులచే వివిధ శక్తులతో పాటు, అష్టసిద్ధులను పొందినవాడు. ఈ కారణంగానే ఆయన సంకల్పమాత్రం చేత సూక్ష్మ .. స్థూల రూపాలను ధరిస్తుంటాడు. అశోకవనంలో సీతాదేవిని గుర్తించిన అనంతరం ఆయన లంకానగరంలోని రావణ సైన్యంపై విరుచుకుపడతాడు.

తన పరాక్రమం చూపించడం కోసం కాకుండా, రాముడి దూతయే ఇంత శక్తిమంతుడైతే ఇక రాముడు ఎంతటి శక్తిమంతుడో అనే భయాన్ని వాళ్లకి కలిగించడం కోసం అలా ప్రవర్తిస్తాడు. అలాంటి హనుమంతుడు కొన్ని క్షేత్రాల్లో పంచముఖాలతో దర్శనమిస్తుంటాడు.

అత్యంత శక్తిమంతమైనదిగా చెప్పబడుతోన్న ఈ రూపంలో హనుమంతుడితో పాటు నరసింహస్వామి .. వరాహస్వామి .. హయగ్రీవుడు ... గరుత్మంతుడు దర్శనమిస్తుంటారు. హనుమంతుడిని పూజించడం వలన ఆరోగ్యంతో పాటు కార్యసిద్ధి కలుగుతుంది. ఇక నరసింహస్వామిని ఆరాధించడం వలన గ్రహ సంబంధమైన దోషాలు తొలగిపోయి సంపదలు చేకూరతాయి.

వరాహస్వామిని పూజించడం వలన దుష్టశక్తుల వలన కలిగే బాధల నుంచి విముక్తి లభిస్తుంది. హయగ్రీవస్వామిని జ్ఞానానికి ప్రతీకగా చెబుతుంటారు. జ్ఞానమే అభివృద్ధిని సాధించడానికీ ... ఉన్నతమైన స్థానాన్ని చేరుకోవడానికి కారణమవుతుంది. అలాంటి జ్ఞానాన్ని అందించే దైవంగా హయగ్రీవుడు పూజలు అందుకుంటూ వుంటాడు.

ఇక గరుత్మంతుడు కన్నతల్లికి దాస్యం నుంచి విముక్తిని కలిగించడం కోసం దేవేంద్రుడితోనే తలపడి అమరలోకం నుంచి అమృతాన్ని సాధించి తెచ్చిన వీరుడు. ఆయనని ఆరాధించడం వలన ఎలాంటి పనిలోనైనా విజయం లభిస్త్ర్హుంది. ఇక ఈ శక్తులన్నీ పంచముఖ హనుమలో వున్నాయి కనుక, ఆయనని పూజించడం వలన ఈ ఫలితాలన్నీ వరాలుగా లభిస్తాయని స్పష్టం చేయబడుతోంది. నియమనిష్టలను పాటిస్తూ భక్తిశ్రద్ధలతో పంచముఖ హనుమను సేవించవలసి వుంటుంది. అందువలన ఆరోగ్యం .. ఐశ్వర్యం ..జ్ఞానం .. విజయం .. మోక్షం లభిస్తాయని స్పష్టం చేయబడుతోంది.


More Bhakti News