ఇక్కడి హనుమంతుడి ప్రత్యేకత ఇదే !

హనుమంతుడి నామం ఎక్కడైతే వినిపిస్తూ వుంటుందో, ఆయన ఆరాధన ఎక్కడైతే జరుగుతూ వుంటుందో అక్కడికి కనుచూపు మేరలో కూడా దుష్టశక్తులు అడుగుపెట్టలేవు. హనుమంతుడిని ఎవరైతే అనునిత్యం పూజిస్తూ వుంటారో, అలాంటివారి దరిదాపుల్లోకి కూడా దారిద్ర్యమనేది రాదు. ఇక హనుమంతుడి భక్తులను అనారోగ్యాలు ఎంతమాత్రం సమీపించలేవు.

హనుమంతుడి పాదాలను ఆశ్రయించడం వలన ఆయన అనుగ్రహంతో పాటు, సమస్త దేవతల ఆశీస్సులు కూడా లభిస్తాయి. అందువల్లనే హనుమంతుడి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతూ వుంటాయి. సాధారణంగా హనుమంతుడు వీరాంజనేయుడు ... భక్తాంజనేయుడు ... అభయాంజనేయుడు వంటి వివిధ నామాలతో ... ముద్రలతో భక్తులకు దర్శనమిస్తుంటాడు. ఇలాంటి ఆయన ముద్రలు భక్తులకు బాగా పరిచయమే.

అలా కాకుండా హనుమంతుడు సాష్టాంగ నమస్కారం చేస్తున్నట్టుగా కనిపించే క్షేత్రం ఒకటుంది అదే .. అనంతపురం జిల్లాలోని 'బూదగవి'. అత్యంత ప్రాచీనమైన సూర్యభగవానుడి ఆలయం ఇక్కడ దర్శనమిస్తుంది. నిండుగా ... కనుల పండుగగా ఇక్కడి సూర్యనారాయణమూర్తి దర్శనమిస్తుంటాడు. ఆ స్వామికి సాష్టాంగనమస్కారం చేస్తున్నట్టుగా హనుమంతుడు కనిపిస్తుంటాడు.

హనుమంతుడి గురువు సూర్యభగవానుడే. ఆయన శిష్యరికంలోనే హనుమంతుడు సకల శాస్త్రాల్లోని సారాన్ని గ్రహించాడు. అందువల్లనే ఇది గురువుకి ఆయన చేస్తోన్న నమస్కారంగా చెబుతుంటారు. హనుమంతుడి వినయవిధేయతలకు ... ఆయన గురుభక్తికి ఇది నిదర్శనమని అంటారు. ఇలా అరుదైన ముద్రలో హనుమంతుడిని చూసిన భక్తులకు అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుంది. ఈ క్షేత్రాన్ని దర్శించడం వలన సూర్యభగవానుడి అనుగ్రహంతో పాటు హనుమంతుడి కటాక్షం కూడా లభిస్తుంది.


More Bhakti News