మహేశ్వరుడి క్షేత్రం మహిమాన్వితమే !

పరమేశ్వరుడు తన కంఠంలో నాగుపామును ధరించి వుంటాడు. ఇక ఆ స్వామికి ఆభరణాలుగా చేతులకు ... కాళ్లకు కూడా నాగులు చుట్టుకుని కనిపిస్తుంటాయి. ఆ స్వామి ఎడబాటును క్షణమైనా భరించలేమని అన్నట్టుగా అవి ఆయనని అంటిపెట్టుకుని వుంటాయి. ప్రాచీనకాలానికి చెందిన కొన్ని క్షేత్రాల స్థలపురాణాలను పరిశీలిస్తే, నాగులు స్వామివారిని ప్రత్యక్షంగా సేవించినట్టు తెలుస్తూ వుంటుంది.

ఆయా క్షేత్రాల శిల్పకళలోను నాగుల ప్రతిమలు ఎక్కువగా కనిపిస్తూ వుంటాయి. ఆ క్షేత్రాల్లో తమ ప్రత్యేకతను ... ప్రాధాన్యతను చాటుతూ వుంటాయి. కొన్ని క్షేత్రాల్లో గర్భాలయంలోని స్వామివారిని కనిపెట్టుకుని వుంటూనే నాగులు ఆ చుట్టుపక్కల సంచరిస్తూ వుంటాయి. వాటిని దేవతా సర్పాలుగా భావించిన భక్తులు నమస్కరిస్తారే తప్ప హాని తలపెట్టరు.

అలా సర్పం స్వామివారిని కనిపెట్టుకుని వుండే క్షేత్రాల్లో ఒకటిగా 'హటకేశ్వరం' కనిపిస్తుంది. శ్రీశైలంలోని పాలధార - పంచదార సమీపంలో హటకేశ్వరస్వామి ఆలయం దర్శనమిస్తుంది. ఒక భక్తుడికి ప్రత్యక్ష దర్శనమిచ్చిన స్వామివారు ఇక్కడ స్వయంభువుగా ఆవిర్భవించినట్టు స్థలపురాణం చెబుతోంది. ఈ క్షేత్రంలో తరచూ ఒక శ్వేతనాగు కనిపిస్తూ ఉంటుందని భక్తులు చెబుతుంటారు. చాలాకాలం నుంచి తరచుగా అది స్వామివారి సన్నిధికి సమీపంలోనే కనబడుతోందని అంటారు.

అది స్వామివారిని కనిపెట్టుకునుండే దేవతా సర్పం కావొచ్చనీ ... ఆయనని సేవిస్తూ ఉండొచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంటారు. నాగులతో గల అనుబంధం కారణంగానే సదాశివుడికి 'నాగేశ్వరుడు' అనే పేరుందనీ, అలాంటి నాగులు దర్శనమిచ్చే ఆయన క్షేత్రాలు మరింత మహిమాన్వితమైనవని చెబుతుంటారు.


More Bhakti News