విష్ణుమాయా విశేషం అదే !
శ్రీమహావిష్ణువు లీలావిశేషాన్ని తెలుసుకోవడం ఎవరి వలనా కాదు. సదా నారాయణ నామస్మరణ చేసే నారద మహర్షి కూడా ఈ విషయాన్ని అనుభవపూర్వకంగా అంగీకరించడం జరిగింది. సృష్టి కర్త అయిన బ్రహ్మ ... లయకారకుడైన శివుడు భక్తుల పట్ల గల వాత్సల్యంతో కాస్తంత తొందరపడి అభయమిచ్చిన సందర్భాలు ... వరాలను అనుగ్రహించిన సంఘటనలు కనిపిస్తుంటాయి. కానీ శ్రీమహావిష్ణువును ఒప్పించడం మాత్రం అంత తేలికైన విషయం కాదు.
ప్రశాంతంగాను ... గంభీరంగాను కనిపించే శ్రీమహావిష్ణువు, ప్రతి విషయాన్ని ఎంతో దూరంగానూ ... మరెంతో లోతుగాను ఆలోచిస్తాడు. అందువల్లనే అసురులు సొంతం చేసుకున్న వరాల వలన లోకాలకు ఎలాంటి ప్రమాదం జరగకుండా పథకరచన చేస్తూ వచ్చాడు. ఆ వరాలలో గల లోపాలను .. అవకాశాలను పరిశీలించి, అందుకు తగినట్టుగా ఆయన అసుర సంహారం జరుపుతూ వచ్చిన తీరుకు హిరణ్యకశిపుడి వధ ఒక ఉదాహరణగా కనిపిస్తూ వుంటుంది.
అలాగే మహిషాసురుడి వృత్తాంతం కూడా ఇందుకు నిదర్శనంగా నిలుస్తుంటుంది. తనకి మరణమనేది త్రిమూర్తి చేతుల్లో గానీ ... పురుషుల చేతిలో గానీ .. ప్రస్తుతమున్న స్త్రీల వలన గాని సంభవించకూడదని శివుడి నుంచి మహిషాసురుడు వరాన్ని పొందుతాడు. ఆ వరగర్వంతో సాధుసజ్జనులను అనేక విధాలుగా హింసిస్తూ ఉండసాగాడు. ఆ రాక్షసుడి ఆగడాలు మితిమీరడంతో, శ్రీమహావిష్ణువు రంగంలోకి దిగవలసి వస్తుంది. మహిషాసురుడు పొందిన వరాన్ని గురించి ఆలోచించిన స్వామి, ఆ రాక్షసుడు ప్రస్తుతమున్న స్త్రీల వలన తనకి చావు రాకూడదని అన్నాడు కాబట్టి, అసమానమైన శక్తి కలిగిన ఒక కొత్త స్త్రీని సృష్టించాలని అనుకుంటాడు.
బ్రహ్మతోను .. శివుడితోను సంప్రదించి తమ శక్తితో కొత్త స్త్రీశక్తి ఆవిర్భవించేలా చేస్తాడు. తన వరంలో గల లోపాన్ని గుర్తించని మహిషాసురుడు ... విష్ణుమాయా విశేషాన్ని తెలుసుకోలేకపోయిన మహిషాసురుడు, దుర్గాదేవితో తలపడి ఆమె చేత సంహరించబడతాడు. ఇలా అనూహ్యామైనటువంటి తన పథకరచనతో శ్రీమహావిష్ణువు ఎప్పటికప్పుడు దుష్టశిక్షణ చేస్తూ వచ్చాడు. లోకకల్యాణంలో ప్రధానమైన పాత్రను పోషిస్తూ వచ్చాడు.