సాయపడాలకునే వాళ్లకి అడ్డుపడకూడదు
జీవితం సార్థకం కావాలంటే ఎవరైనా ముందుగా దైవకార్యాలకీ ... ధర్మకార్యాలకి ప్రాధాన్యత ఇస్తుండాలి. ఇందుకుగాను తమ సంపాదనలో ఎంతో కొంత మొత్తాన్ని కేటాయిస్తూ వుండేవాళ్లు చాలామంది కనిపిస్తుంటారు. వాళ్లు తమ ఇష్టదైవానికి ఆభరణాలు చేయించాలని అనుకుంటారు. ఆలయంలో స్వామివారికి వాహనసేవలు తయారు చేయించాలని నిర్ణయించుకుంటారు.
కల్యాణోత్సవానికిగాను స్వామివారికీ ... అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించాలని అనుకుంటారు. అలాగే ఒక్కోసారి ఒక్కో క్షేత్ర దర్శనం చేయాలని అనుకుంటారు. అలాంటి సమయంలో వాళ్ల మనసు మార్చే ప్రయత్నం చేయకూడదని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఇప్పుడీ ఖర్చు అవసరమా ... తరువాత చూసుకోవచ్చు అంటూ వాళ్ల దగ్గరున్న సొమ్మును మరోదానికి ఉపయోగించమనే సలహాలు ఇస్తుంటారు. ఫలితంగా దైవకార్యానికి అందించాలనే సాయం వాయిదాపడటమే కాకుండా ఒక్కోసారి ఆగిపోయే అవకాశం కూడా వుంటుంది.
అలాగే కొంతమంది దానధర్మాలు చేయడానికి సిద్ధపడినప్పుడు కూడా ఇలా వెనక్కిలాగేవాళ్లు వుంటారు. దానధర్మాల పేరుతో ఆస్తులు హారతి కర్పూరం చేసుకున్న వాళ్లు చాలామంది ఉన్నారంటూ నిరుత్సాహపరిచి, వాళ్ల మనసును మళ్లించడానికి ప్రయత్నిస్తుంటారు. ఫలితంగా నిరాశ్రయులకు ఆ సాయం అందకుండా పోతుంటుంది. ఎవరి స్థాయికి తగినంతలో వాళ్లు దైవకార్యాలకి తమ సహాయ సహకారాలను అందించవచ్చు ... అలాగే దానధర్మాలను చేయవచ్చు.
ఎవరో ఏదో చెప్పారని వీటి విషయంలో మనసు మార్చుకోకూడదు. భగవంతుడి సేవలో పాలుపంచుకునే అవకాశం ఏ రకంగా వచ్చినా దానిని వదులుకోకూడదు. ఇక మంచి మనసుతో ఇలాంటి వాళ్లు దైవకార్యాలకి అందించే సాయాన్నీ, దానధర్మాలు చేయాలనే ఆలోచనను ఎలాంటి పరిస్థితుల్లోను అడ్డుకోకూడదు. అలా ఉద్దేశపూర్వకంగా ఇలాంటి కార్యాలకి ఆటంకం కలిగించడం కూడా పాపమే అవుతుందని చెప్పబడుతోంది.