విభూతి ధారణ ఫలితం అలాంటిది !
ఆదిదేవుడిని అర్చించే సమయంలోను ... అభిషేకించే సమయంలోను విభూతి ధారణ చేసివుంటే, పరిపూర్ణమైన ఫలితం లభిస్తుంది. పరమశివుడి ప్రీతిని సంపాదించి పెట్టేవాటిలో విభూతి ధారణ ప్రధానమైనదిగా కనిపిస్తుంది. విభూతితో అభిషేకం చేయడం వలన ... విభూతితో తయారుచేసుకున్న శివలింగాన్ని పూజించడం వలన తేజస్సు కలుగుతుంది.
కపిలగోవు పేడతో చేసిన పిడకలను కాల్చడం వలన వచ్చినది విభూతిగా చెప్పబడుతోది. శివభక్తులు ... బ్రాహ్మణులు విభూతిని ఎక్కువగా ధరిస్తూ వుంటారు. నుదురు .. కంఠం .. భుజాలు ... చేతులు ... హృదయం ... ఉదరభాగంలో విభూతి ధారణ చేస్తుంటారు. ఇలా అనునిత్యం విభూతిని ధరించేవారు పరమశివుడి అనుగ్రహానికి పాత్రులవుతారని చెప్పబడుతోంది.
విభూతి మహిమను తెలిపే ఎన్నో ఆసక్తికరమైన కథనాలు ఆధ్యాత్మిక గ్రంధాలలో కనిపిస్తుంటాయి. తెలిసి ఎలాంటి పుణ్యకార్యం చేయని ఒక వ్యక్తికి మరణాంతరం కైలాసంలో చోటు లభిస్తుంది. ఇదెలా సాధ్యమని ఆ వ్యక్తి అక్కడివారిని అడిగితే, ఆయన ప్రమేయం లేకుండానే ఆయనపై పడిన విభూతి అందుకు కారణమని వాళ్లు చెబుతారు. దీనిని బట్టి విభూతి మహిమ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
అలాంటి విభూతిని ధరించి శివారాధన చేయడం వలన సమస్త పాపాలు నశించిపోతాయి. వివిధరకాల దోషాలు ... వాటివలన కలిగే దుఃఖాలు దూరమైపోతాయి. విభూతి ధారణ శంకరుడికి మరింత సమీపంగా తీసుకు వెళుతుంది కాబట్టి, ఆయన అనుగ్రహంతో సంపదలు .. శుభాలు కలుగుతాయి. శివానుగ్రహాన్ని కోరుకునేవారు ముందుగా ధరించవలసినది విభూతి అని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. విభూతి మహేశ్వరుడి ప్రసాదంగా ... మహిమాన్వితమైనదిగా స్పష్టం చేస్తున్నాయి.