విశేష ఫలితాలనిచ్చే విశ్వనాథుడి ఆరాధన
సదాశివుడు సదా తన భక్తుల సంతోషాన్ని మాత్రమే కోరుకుంటూ వుంటాడు. అందువలన ఆపదలు వాళ్ల దరిచేరకుండా ... సమస్యలతో సతమతం కాకుండా కాపాడుతూ వుంటాడు. పరమేశ్వరుడి పాదపద్మాలను ఆశ్రయించిన భక్తుల జీవితాలను పరిశీలిస్తే, తన భక్తులను ఆయన ఎంతలా కనిపెట్టుకునుంటాడనే విషయం అర్థమవుతుంది.
ఎంతోమంది దేవతలు అనేక పవిత్రమైన ప్రదేశాల్లో శివలింగాన్ని ప్రతిష్ఠించి ఆరాధించారు .. ఆ దేవదేవుడి నుంచి కావలసిన వరాలను పొందారు. అలాగే మహర్షులు ఆయా ప్రదేశాల్లో శివలింగాలను ప్రతిష్ఠిస్తూ ఆ విశ్వనాథుడిని పూజిస్తూ మోక్షాన్ని సాధించారు. ఇక ఇసుకతోను .. మట్టితోను .. గోమయంతోను .. విభూతితోను .. బియ్యపు పిండితోను శివలింగాన్ని తయారుచేసి పూజించడమనేది ప్రాచీనకాలం నుంచి వుంది.
ఇలా వివిధ రకాల పదార్థాలతో తయారుచేసుకున్న శివలింగాలను ఆరాధించడం వలన కలిగే విశిష్టమైన ఫలితాల ప్రస్తావన మనకి ఆధ్యాత్మిక గ్రంధాలలో కనిపిస్తుంది. ఇక 'బియ్యపు పిండి' తో చేసిన శివలింగపూజ విషయానికి వస్తే, ఈ శివలింగాన్ని పూజించడం వలన ఎలాంటి పరిస్థితుల్లోను ఆహార కొరత ఏర్పడదని చెప్పబడుతుంది. అంతే కాకుండా అనారోగ్యాలు దరిచేరవని స్పష్టం చేయబడుతోంది.
కుటుంబ పోషణ విషయంలోనూ .. అనారోగ్యాలతోను ఇబ్బందులు పడుతున్నవాళ్లు ఈ శివలింగాన్ని పూజించడం వలన ఆశించిన ఫలితం కనిపిస్తుంది. కుటుంబ పోషణ భారాన్ని నిర్వహించడం ... ఎవరికి ఎలాంటి అనారోగ్యం వచ్చినా దాని నుంచి బయటపడటం అనే ఈ రెండు సమస్యలు పెద్దవే. అలాంటి కష్టాలకు దూరంగా ఉండాలనుకునేవాళ్లు ... వాటిలో నుంచి విముక్తిని పొందాలనుకునే వాళ్లు బియ్యపు పిండితో చేసిన శివలింగాన్ని పూజించడం వలన మంచి ఫలితం కనిపిస్తుంది.