అమ్మవారు ఇలా శాంతిస్తుందట !
ప్రతి తల్లి కూడా తన పిల్లల క్షేమాన్ని గురించే నిరంతరం ఆలోచిస్తూ వుంటుంది. వాళ్లు బాగుండటం కోసం అహర్నిశలు కష్టపడుతుంది. ప్రతి విషయంలోనూ సహనంతో సర్దుకుపోతూ, అనేక త్యాగాలు చేస్తూ వెళుతుంది. అలా అపురూపంగా చూసుకునే తన బిడ్డలకి హాని తలపెట్టడానికి ఎవరు ప్రయత్నించినా ఆ తల్లి ఎంతమాత్రం సహించదు. తన బిడ్డలను రక్షించుకోవడం కోసం ఎలాంటి పోరాటానికైనా ఆమె సిద్ధపడుతుంది. అది సాక్షాత్తు సమస్త లోకాలకు తల్లిగా ఆరాధించబడుతోన్న ఆ ఆదిపరాశక్తి నుంచి వచ్చిన తత్త్వమే.
అమ్మవారు ప్రశాంతమైన వదనంతో చిరునవ్వులు చిందిస్తూ లోకాలను చల్లగా చూస్తుంటుంది. తన బిడ్డల వంటి ప్రజలను ప్రకృతి వైపరిత్యాల నుంచి సదా కాపాడుతూ వుంటుంది. ఇక ఉద్దేశపూర్వకంగా ఎవరైనా తన బిడ్డలను హింసించడానికి పూనుకుంటే అమ్మవారు ఆగ్రహావేశాలకు లోనవుతుంది. తన బిడ్డలను కాపాడుకోవడానికిగాను వెంటనే రంగంలోకి దిగుతుంది.
ఈ నేపథ్యంలోనే అమ్మవారు అనేక రూపాలను ధరిస్తూ ... అసుర సంహారం చేస్తూ వచ్చింది. అలా లోకకల్యాణం కోసం అమ్మవారు 'అరుణాసురుడు' అనే రాక్షసుడిని సంహరించిన ప్రదేశంగా కర్ణాటక రాష్ట్రానికి చెందిన 'కటీలు' క్షేత్రం కనిపిస్తుంది. అసుర సంహారం చేసిన అమ్మవారు అదే ఆగ్రహావేశాలతో ఊగిపోతూ ఇక్కడ ఆశీనురాలై వుండగా, ఆ తల్లిని శాంతింపజేయడానికి దేవతలంతా వచ్చి కొబ్బరి నీళ్లతో అభిషేకించారట. ఈ కారణంగానే ఇప్పటికీ ఇక్కడి అమ్మవారిని ప్రతి రోజూ కొబ్బరినీళ్లతో అభిషేకిస్తూ వుండటం విశేషం.