కలలో సముద్రం కనిపిస్తే ?
సాధారణంగా కలలనేవి అందరికీ వస్తూనే వుంటాయి. మనసు బాగోలేనప్పుడు వచ్చే కలలు ఆందోళన కలిగించేవిగా వుంటాయి. ఇక మనసు సంతోషంగా వునప్పుడు వచ్చే కలలు ఆహ్లాదకరంగా వుంటాయి. అంటే మనసును ఎక్కువగా ప్రభావితం చేసే విషయాలే దృశ్యరూపాన్ని సంతరించుకుని కలలుగా వస్తుంటాయి. అలాంటి కలలు ఎలాంటి ఫలితాలను ఇవ్వవట. మనసు సాధారణమైన స్థితిలో వున్నప్పుడు ... తెల్లవారుజామున వచ్చే కొన్నికలలు మాత్రమే ఫలితాన్ని చూపుతాయని చెప్పబడుతోంది.
ఈ నేపథ్యంలో ఒక్కోసారి సముద్రం కూడా కలలో కనిపించే అవకాశం లేకపోలేదు. సహజంగా సముద్రాన్ని బయటచూస్తేనే కొంతమందికి మనసంతా అలజడిగా అనిపిస్తుంది. ఆ హోరు ... కెరటాలు పోటీపడుతున్నట్టుగా దూసుకుంటూ రావడం ఒకరకమైన భయాన్ని కలిగిస్తుంది. అందువలన కలలో సముద్రం కనిపించినా ఆందోళన కలుగుతుంది.
ఆందోళన కలిగించే కలలు, ఆ తరువాత నిద్రపట్టనివ్వవు గనుక వచ్చిన కల తెల్లవారిన తరువాత కూడా గుర్తుంటుంది. కొంతమంది పెద్దగా పట్టించుకోరుగానీ, మరికొంతమంది ఇలాంటి కలల గురించి సన్నిహితులతో చెప్పుకుంటూ వుంటారు. ఇక కలలో సముద్రం కనిపిస్తే కష్టాలను ఎదుర్కోవలసి వస్తుందనే సూచనగా భావించాలని చెప్పబడుతోంది.
అయితే జీవితమే ఒక సముద్రం ... సమస్యలే సుడిగుండాలు ... ఆశలే కెరటాలు ... తీరమే గమ్యంగా చెప్పబడుతూ వుంది కాబట్టి, కొత్తగా వచ్చిన కలను గురించి ఆందోళన చెందవలసిన పనిలేదు. ఇలాంటి కలలు వచ్చినప్పుడు ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండేలా చూసుకుంటే సరిపోతుంది. భగవంతుడి అనుగ్రహంతో బయటపడలేని కష్టం ఈ విశ్వంలోనే లేదనుకుంటే మనసు మరింత తేలిక పడుతుంది.