విగ్రహం వేణువు వాయిస్తుందా ?

రాముడు .. కృష్ణుడు .. నరసింహస్వామి .. ఇలా భగవంతుడు వివిధ నామాలతో పిలవబడుతూ భక్తులచేత పూజాభిషేకాలు అందుకుంటూ వుంటాడు. దేవతలు ... మహర్షులు ... భక్తులైన మహారాజులచే అర్చామూర్తిగా ఆరాధించబడిన భగవంతుడు, తన జాడను భక్తులు తెలుసుకోలేకపోయినప్పుడు తానే తన ఆచూకీని తెలుపుతూ వెలుగుచూసిన సంఘటనలు ఎన్నోవున్నాయి.

సాధారణంగా అప్పటివరకూ నిక్షిప్తంగా వున్న భగవంతుడు తాను ప్రకటనమయ్యే సమయానికి భక్తులకు స్వప్నంలో దర్శనమిస్తూ వుంటాడు. తన అర్చామూర్తి ఫలానా ప్రదేశంలో వుందని ఆనవాళ్లు చెప్పి అదృశ్యమవుతూ వుంటాడు. అయితే అందుకుభిన్నంగా భగవంతుడు తాను నిక్షిప్తంగా వున్న చోటు నుంచి భక్తులకు వినిపించేలా ధ్వని చేయడమనేది మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తూ వుంటుంది. మహిమాన్వితమైన అలాంటి సంఘటనకు వేదికగా 'వడ్ల మన్నాడు' గ్రామం కనిపిస్తుంది.

కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం పరిధిలో ఈ క్షేత్రం విలసిల్లుతోంది. చాలాకాలం క్రితం ఈ గ్రామంలో కృష్ణ భక్తులైన ఓ కుటుంబం ఉండేది. పాడిపంటలు సమృద్ధిగా గల ఆ ఇంట్లో ప్రతిరోజు చల్లచిలుకుతూ వుండేవాళ్లు. అలా చల్లచిలుకుతూ వున్న సమయంలో మాత్రమే ఎక్కడి నుంచో లీలగా వేణుగానం వినిపిస్తూ ఉండేదట. మధురమైన ఆ వేణుగానం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకోవడానికి వాళ్లకి చాలారోజులు పట్టింది.

ప్రతిరోజు చల్లచిలికే ప్రదేశంలో నేల అడుగు నుంచి ఆ వేణుగానం వస్తుందని గ్రహించి నెమ్మదిగా అక్కడ తవ్వుతారు. కొంత లోతుగా తవ్విన తరువాత వాళ్లకి 'రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలస్వామి' ఏకశిలా విగ్రహం కనిపిస్తుంది. అప్పుడా విగ్రహాన్ని వెలికితీయగా ఆ తరువాత కాలంలో ఆలయాన్ని నిర్మించి ప్రతిష్ఠించారు. ఇలా ఇక్కడి కృష్ణుడు వేణుగానం ద్వారా తన ఆచూకీని తెలియజేసి వెలుగుచూడటం ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఆ స్వామి ఇక్కడ ప్రత్యక్షంగా వున్నాడనే బలమైన విశ్వాసం కలుగుతుంది. ఆయన దర్శనంతో అనిర్వచనీయమైన అనుభూతి దక్కుతుంది.


More Bhakti News