దానం ఎప్పడు పరిపూర్ణ ఫలితాన్నిస్తుంది ?
జీవితం వైభవంగా వుండాలనే అంతా కోరుకుంటూ వుంటారు. అయితే అలాంటి వైభవం వలన దేహానికి సుఖం కలుగుతుందేగాని, అది ముందుజన్మలకి ఏ విధంగాను ఉపయోగపడదు. వెనుకజన్మలో చేసుకున్న దానం కారణంగానే ఈ రోజున ఈ వైభవం వచ్చిందనే ఆలోచనచేస్తే, దానాలు చేయాలనే ఉద్దేశం కలుగుతుంది. ఇక్కడ సుఖశాంతులను కలిగించేవి, మరణానంతరం ఉత్తమజన్మలు కలిగించేవి దానధర్మాల వలన వచ్చే పుణ్యఫలితాలేనని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.
దానం చేయడం వలన ఎదుటి వ్యక్తి పొందే సాయంకన్నా చేసినవారు పొందే పుణ్యఫలితాలే ఎక్కువ. అందుకే చాలామంది తమకి తోచినంత దానం చేసేస్తుంటారు. పర్వదినాల్లోను ... వ్రతాల సందర్భంలోనూ ... ఆలయాలకి వెళ్లినప్పుడు ... నిరాశ్రయులమంటూ ఎవరైనా వచ్చినప్పుడు తమ తాహతుకి తగినట్టుగా దానం చేస్తుంటారు. గోదానం .. భూదానం .. సువర్ణ దానం .. వస్త్రదానం .. అన్నదానం .. విద్యాదానం .. ఇలా దానమేదైనా అది పుణ్యఫలాలను అందించేదే ... ఉత్తమగతులను కల్పించేదే.
అయితే చేసిన దానం వలన పరిపూర్ణమైన ఫలితం లభించాలంటే, ఆ దానాన్ని మనస్ఫూర్తిగా చేయాలి. అంతేకాదు ఆ దానం గురించిన విషయం గుప్తంగా వుండాలని చెప్పబడుతోంది. వాళ్లకి ఆ దానం చేశాను ... వీళ్లకి ఈ దానం చేశాను అనే మాటలు, తన గొప్పతనాన్ని చాటుకోవడానికే చేసినవిగా చెప్పకనే చెబుతుంటాయి. అలా చెప్పడం వలన దానం చేయడం వలన రావలసిన ఫలితం దక్కకుండా పోతుంది.
అందుకే చాలామంది దానధర్మాలు చేసే వాళ్లు నలుగురిలో తమ పేర్లు చెప్పడానికి ఇష్టపడరు. దానంగా ఇచ్చే వస్తువులపై కూడా తమ పేరు రాయడానికి అంగీకరించరు. దానం తీసుకున్నవాళ్లకీ ... తమకి తప్ప మరొకరికి తెలియకుండా, మరెక్కడా ఆ ప్రస్తావన రాకుండా చూసుకుంటారు. పైకి నిరాడంబరంగా కనిపిస్తూ ఇలా గుప్తదానాలు చేసే మహానుభావులు ఎంతోమంది ఈ రోజుల్లోనూ వున్నారు. అలాంటి గుప్తదానాల వలన పరిపూర్ణమైన ఫలితం లభిస్తుందని స్పష్టం చేయబడుతోంది.