అలాంటివారికే అనుగ్రహం దక్కుతుంది !

భగవంతుడిపై విశ్వాసం లేకుండా ఆలయానికి వెళ్లడం, గురువుపై నమ్మకం లేకుండా ఆయనని ఆశ్రయించడం వలన ఎలాంటి ప్రయోజనం వుండదు. భక్తుడైనా ... శిష్యుడైనా పరిపూర్ణమైనటు వంటి విశ్వాసాన్ని కలిగివుండాలి. అప్పుడే వాళ్ల అనుగ్రహాన్ని పొందగలుగుతారు. వీరబ్రహ్మేంద్రస్వామిని పూర్తిగా విశ్వసించిన సిద్ధయ్య, గురువు ఆదేశం మేరకు చనిపోయినటువంటి కుక్కమాంసం తినడానికి సిద్ధపడతాడు. అయితే అది సిద్ధయ్యకి గురువు పెట్టిన పరీక్ష ... అందులో ఆయన గెలిచి గురువు యొక్క అనుగ్రహానికి పాత్రుడవుతాడు.

ఇక సమర్థరామదాసు కడుపులో నొప్పితో బాధపడుతూ, ఉపశమనం కోసం 'శివంగి' పాలు తీసుకురమ్మని తన శిష్యుడైన శివాజీ మహారాజుతో చెబుతాడు. గురువు ఆశీస్సులే వుంటే అసాధ్యమైనది లేదంటూ బయలుదేరి వెళ్లిన శివాజీ, అడవిలో గాలించి సింహం పాలు తీసుకువస్తాడు. శిష్యుడు అంటే అలా వుండాలని గురువు చేత అభినందనలు అందుకుంటాడు.

ఇక ఆదిశంకరాచార్యులవారి దగ్గర 'సనందుడు' అనే శిష్యుడు ఉండేవాడు. శంకరులవారికి సేవ చేయడంలో సనందుడు ముందుండేవాడు. ఎంతటి కష్టమైన పనిని అప్పగించినా గురువు నోటి నుంచి మాట వెలువడగానే ఆ క్షణమే ఆచరణలో పెట్టేవాడు. అలాంటి సనందుడు ఒకసారి గంగానది అవతల తీరానికి వెళతాడు. పాఠాన్ని ఆరంభిస్తూ శంకరులవారు సనందుడిని పిలుస్తారు. గురువు పిలవగానే క్షణాల్లో ఆయన దగ్గర ఉండాలనే ఆతృతతో ఆయన ఆ నదిపై పరిగెత్తుకు వచ్చేస్తాడు.

అడుగువేస్తే మునిగిపోయే నదిపై సనందుడు పరిగెత్తుకురావడం చూసిన మిగతా శిష్యులు ఆశ్చర్యపోతారు. గురువు ఆజ్ఞను వెంటనే పాటించాలనే ఆతృత సనందుడు గంగానదిలో అడుగుపెట్టేలా చేస్తే, ఆ గురువుపట్ల గల అపారమైన విశ్వాసం ఆయన మునిగిపోకుండా తీరానికి చేరుస్తుంది. అందుకే గురువును ఆశ్రయించినా, భగవంతుడి పాదాలను ఆశ్రయించినా కావలసినది బలమైన విశ్వాసమేననే విషయాన్ని మరిచిపోకూడదు.


More Bhakti News