ఇలాంటి ఇల్లంటే లక్ష్మీదేవికి ఇష్టమట !

ఏ ఇంటి వాకిట్లో నిండుగా అందమైన రంగవల్లికలు దిద్ది ఉంటాయో ... ద్వారానికి పచ్చని మామిడి తోరణాలు కట్టబడి ఉంటాయో ... పసుపుగడపకి కుంకుమ బొట్లుపెట్టి ఉంటాయో ఆ ఇల్లు శుభప్రదంగా కనిపిస్తూ వుంటుంది. లక్ష్మీదేవి ఆ ఇంట్లో ఉందనే విషయం చూడగానే తెలిసిపోతుంది. పరిశుభ్రత ... ప్రశాంతత ... పవిత్రత వున్న ఇంట్లో లక్ష్మీదేవి కొలువుంటుంది. ఆ తల్లి వున్న ఇల్లు సహజంగానే కళకళలాడుతూ కనిపిస్తుంది.

అయితే లక్ష్మీదేవి అడుగుపెట్టడానికి కేవలం పరిశుభ్రత మాత్రమే వుంటే సరిపోదు. ఆ కుటుంబసభ్యులంతా సత్యాన్ని వ్రతంగా ఆచరిస్తూ వుండాలి. ఎవరైతే సత్యాన్ని ఆచరిస్తూ తమ జీవితాన్ని కొనసాగిస్తూ వుంటారో అలాంటివారి ఇంట లక్ష్మీదేవి ఉంటుందని చెప్పబడుతోంది. ఇక సత్యమనే దానికి ఒక విలువనేది ఇవ్వకుండా ప్రతి చిన్న విషయానికి కూడా అబద్ధమాడుతూ ఎవరైతే వుంటారో, అలాంటివారి ఇంట ఉండేందుకు లక్ష్మీదేవి ఆసక్తి చూపదని స్పష్టం చేయబడుతోంది.

లక్ష్మీదేవికి ఎంతమాత్రం ఇష్టంలేనివాటిలో అసత్యమనేది ఒకటిగా కన్పిస్తుంది. ఈ రోజుల్లో అబద్ధమాడకుండా బతకడం చాలా కష్టమని కొంతమంది అంటూ వుంటారు. అయితే అబద్ధమాడే పరిస్థితిని ఎవరికివారే తెచ్చుకుంటూ వుంటారు. సంతృప్తికరమైన జీవితాన్ని కోరుకునేవారు అబద్ధాలాడవలసిన అవసరం ఎక్కువగా వుండదు. అబద్ధాలాడకూడదు అని ఒకసారి నిర్ణయించుకున్న తరువాత, అబద్ధాలాడవలసిన సందర్భాలు తగ్గుతూ వస్తుంటాయి.

అసత్యమనే దానికి ఎవరైతే దూరంగా ఉంటారో వాళ్లు తాత్కాలికంగా ఇబ్బందులు ఎదుర్కున్నా ఆ తరువాత ఆనందకరమైన జీవితాన్ని పొందుతారు. ఇక అసత్యమే జీవితంగా గడిపేవాళ్లు తాత్కాలికంగా సుఖపడినా ఆ తరువాత కష్టాల్లో పడతారు. అందుకు కారణం సత్యాన్ని ఆచరించే వాళ్ల ఇంట లక్ష్మీదేవి కొలువై వుండటం, అసత్యాన్ని ఆశ్రయించినవాళ్లకి అందనంత దూరంగా లక్ష్మీదేవి వెళ్లిపోవడమేనని చెప్పొచ్చు.


More Bhakti News