అదే రంగుల పండుగ ప్రత్యేకత !
హోలీ అనగానే అందరికీ రంగులు గుర్తుకువస్తాయి ... ఆ రంగులను ఒకరిపై ఒకరు చల్లుకుంటూ ఉత్సాహంతో చేసే సందడి గుర్తుకువస్తుంది. ప్రతి సంవత్సరం జరుపుకుంటూనేవున్నా, ఎప్పుడూ కొత్తగానే అనిపిస్తూ వుండటం హోలీ ప్రత్యేకత. ఈ రంగులన్నీ జీవితం ఆనందమయంగా కొనసాగాలనే సంకేతాన్ని ఇస్తున్నట్టుగా కనిపిస్తుంటాయి. కలిసి వుంటే కష్టాలను మరచిపోవచ్చనే సందేశాన్ని వినిపిస్తుంటాయి.
తనలో కామవికారాలు కల్పించడానికి ప్రయత్నించిన 'మన్మథుడు'ని శివుడు తన మూడవ నేత్రం చేత భస్మం చేసిన రోజు ఫాల్గుణ శుద్ధ చతుర్దశిగా చెప్పబడుతోంది. ఈ సంఘటనకు గుర్తుగా ఈ రోజున అనేక ప్రాంతాల్లో 'కామదహనం' పేరుతో మన్మథుడి గడ్డి బొమ్మను దహనం చేస్తుంటారు. ఇక మరుసటి రోజైన పౌర్ణమి రోజున కాముడికి అదృశ్య రూపాన్ని ఇచ్చినందుకు సంతోషంగా రంగుల పండుగను జరుపుకుంటూ వుంటారు.
ఇక ఈ రోజుకు 'హోలీ' అనే పేరు రావడం వెనుక కూడా ఆసక్తికరమైన కొన్ని కథనాలు వినిపిస్తుంటాయి. హోళికా అనే రాక్షసి అగ్నిలో తన శరీరం దహించబడకుండా వరాన్ని పొందుతుంది. హరినామ సంకీర్తనం చేస్తోన్న ప్రహ్లాదుడిని శిక్షించాలని అనుకున్న హిరణ్యకశిపుడు, హోళికకి గల వరాన్ని గురించి తెలుసుకుని ఆమెని పిలిపిస్తాడు. ప్రహ్లాదుడిని పట్టుకుని అగ్నిజ్వాలల్లో ప్రవేశించమని చెబుతాడు.
మంటలు తనని ఏమీ చేయలేవు కనుక, వాటిలో ప్రహ్లాదుడు కాలిపోవడం ఖాయమని హిరణ్యకశిపుడితో చెప్పి హోళిక అగ్నిజ్వాలల్లోకి ప్రవేశిస్తుంది. అయితే ఆ అగ్నిజ్వాలల బారి నుంచి ఆమెని ఆ వరం కాపాడలేకపోతుంది. హోళికా అందులో భస్మమైపోగా శ్రీహరి అనుగ్రహంతో ప్రహ్లాదుడు క్షేమంగా బయటికివస్తాడు. హోళిక పీడ వదిలిన ఈ రోజున అప్పట్లో సంబరాలు జరుపుకున్నారు.
ఫాల్గుణ పౌర్ణమి రోజున హోళిక పేరుతో మొదలైన ఈ సంబరం, కాలక్రమంలో హోలీగా ప్రసిద్ధి చెందింది. అలా ఈ రంగులపండుగ వెనుక శ్రీమహావిష్ణువు లీలావిశేషం ... పరమశివుడి లీలావిన్యాసం కనిపిస్తుంటాయి. ఇక ఆధ్యాత్మిక పరమైన విషయాలను అలా ఉంచితే, మనస్పర్థలను తొలగించి స్నేహ భావాన్ని పెంపొందింపజేసేదిగా హోలీ తనదైన ప్రత్యేకతను సంతరించుకుని కనిపిస్తుంది.