అమ్మవారికి ఆలయమే అత్తవారిల్లట !
సుగుణాల రాశి అయిన ఒక యువతి కొత్తగా అత్తవారింట అడుగుపెట్టడం ... అక్కడ అనేక కష్టాలకు గురికావడం ... త్యాగానికి ప్రతిరూపమైన ఆ యువతి శరీరాన్ని వదిలిపెడుతూ దేవతగా మారుతునట్టుగా ప్రకటించడం ... ఆ రోజు నుంచి దేవతగా పూజలు అందుకుంటూ వుండటం వంటి కథనాలతో కొన్ని క్షేత్రాలు కనిపిస్తుంటాయి. అలాంటి క్షేత్రాల్లో ఒకటిగా 'వీరమ్మతల్లి' క్షేత్రం అలరారుతోంది.
కృష్ణా జిల్లా ఉయ్యూరులో గల వీరమ్మతల్లి ఇక్కడి వాళ్ల ఇలవేల్పుగా పూజలు అందుకుంటోంది. విశాలమైన నేత్రాలు ... చక్కని ముక్కెరతో ... వివిధ రకాల ఆభరణాలతో ... నిండు ముత్తయిదువుగా ఈ అమ్మవారు దర్శనమిస్తూ వుంటుంది. కోరిన వరాలను ప్రసాదించే తల్లిగా భక్తులు అమ్మవారిని ఆరాధిస్తూ వుంటారు. సంతాన సౌభాగ్యాలను కోరుకునే భక్తులు ఇక్కడ ఎక్కువగా కనిపిస్తూ వుంటారు.
ఇక్కడి ఆలయం అమ్మవారి అత్తవారిల్లనీ, ఇక్కడికి దగ్గరలో గల ఓ పెంకుటిల్లు అమ్మవారి పుట్టిల్లని చెబుతుంటారు. అమ్మవారి అనుగ్రహాన్ని కోరుకునే భక్తులు శుక్రవారం రోజున దర్శించుకుని చీరసారెలు సమర్పిస్తుంటారు. ప్రతి ఏడాది 'భీష్మ ఏకాదశి' నుంచి పదిహేను రోజుల పాటు ఇక్కడ జాతర జరుగుతూ వుంటుంది. ఈ సందర్భంలోనే అమ్మవారు ఊరేగింపుగా పుట్టింటికి వెళుతుంది.
ఈ ఊరేగింపులో భక్తులు అమ్మవారికి ఎదురువెళ్లి దీపాలు సమర్పిస్తుంటారు. వీటినే 'ఎదురు దీపాలు' అని అంటారు. పుట్టింటికి వెళ్లిన అమ్మవారు, ఇక్కడికి సమీపంలో గల 'ఐలూరు' కృష్ణా నదిలో శివరాత్రి రోజున స్నానమాచరించి తిరిగి ఆలయానికి వస్తుంది. ఈ ఉత్సవంలో వేలాదిగా భక్తులు పాల్గొంటూ వుంటారు. ఇక ఇక్కడ జరిగే 'ఊయల ఉత్సవం' విశేషమైనదిగా చెబుతుంటారు. అమ్మవారిని ఈ సమయంలో దర్శించుకున్న భక్తుల దోషాలు ... పాపాలు నశిస్తాయని అంటారు.
ఇక ఈ సందర్భంలో జరిగే 'శిడి బండి' ఉత్సవం అమ్మవారి మహిమలకు నిదర్శనంగా నిలుస్తుంది. ఇలా వీరమ్మతల్లి క్షేత్రం అనేక విశేషాలకు ... మహిమలకు నిలయంగా కనిపిస్తూ వుంటుంది. అడుగడుగునా భక్తిభావ పరిమళాలను వెదజల్లుతూ వుంటుంది.