శకునంగా నాగుపాము కనిపిస్తే ?

పాము .. అనే మాట వినగానే ఎవరైనా సరే ఒక్కసారిగా ఉలిక్కిపడి పైకి లేస్తారు. అది ఎక్కడ నుంచి వస్తుందా అని అటూ ఇటూ చూస్తారు. అది దగ్గరలో కనిపిస్తే పరిగెత్తడం, దూరంగా వెళ్లిపోతే తేలికగా ఊపిరిపీల్చుకోవడం చేస్తుంటారు. జాతి ఏదైనా ... అది పెద్దదైనా చిన్నదైనా .. విషసర్పమైనా కాకున్నా పాము అనే రెండు అక్షరాలు మనిషిని భయపెడతాయి. అలా పాముల పట్ల భయమే కాదు ... భక్తి కూడా వుండటం విశేషం.

నాగుపాములను దేవతా సర్పాలుగా భావిస్తూ ఉండటం ... వాటికి ఆలయాలు కట్టి పూజిస్తూ వుండటం ప్రాచీనకాలం నుంచి వుంది. నాగులు పాతాళలోకంలో నివసిస్తాయనీ, భూలోకవాసులతో అవి అనుబంధాన్ని కలిగి ఉన్నాయనే కథనాలు మనకి ఆయా క్షేత్రాల్లో స్థలపురాణంగా వినిపిస్తుంటాయి. ఏదైనా ముఖ్యమైన పనిమీద వెళుతున్నప్పుడు మంచిశకునం చూసుకుని బయలుదేరుతుంటారు. అలాంటి సమయంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోవారికి ఒక్కోసారి పాము ఎదురుపడటం జరుగుతూ వుంటుంది.

పాము ఎదురుపడిన విధానాన్ని బట్టి వివిధ రకాల ఫలితాలు కనిపిస్తుంటాయి. ముఖ్యంగా రైతులు వ్యవసాయ సంబంధమైన పనుల నిమిత్తం బయలుదేరినప్పుడు పాము కనిపిస్తే అది మంచి శకునంగా చెప్పబడుతోంది. వ్యవసాయ సంబంధమైన పనులు ప్రారంభించే రోజున పొలంలోగానీ ... చేలో గాని పాము కనిపిస్తే అధిక దిగుబడులు రావడం ఖాయమనే విశ్వాసాన్ని రైతులు వ్యక్తం చేస్తుంటారు.

పంటలకు హాని కలిగించే క్రిమి కీటకాలను ఆహారంగా స్వీకరిస్తూ, పంటల దిగుబడి పెరగడానికి పాములు కారణమవుతూ వుంటాయి. అలాంటి పాములు వ్యవసాయ పనులు ఆరంభిస్తూ వుండగా కనిపిస్తే శుభ సూచకమనీ, ప్రకృతి కారణంగా గానీ ... క్రిమికీటకాల వలన గాని ఎలాంటి నష్టం జరగకుండా పంట చేతికి వస్తుందని రైతులు భావిస్తుంటారు.


More Bhakti News