పాదరస శివలింగాన్ని ఆరాధిస్తే చాలు

జీవితంలో అనేక అవరోధాలను ఎదుర్కుంటూ ముందుకుసాగడానికీ, భగవంతుడి తత్త్వాన్ని అర్థంచేసుకోవడానికి జ్ఞానం అవసరం. చీకటిని వెలుగు పారద్రోలినట్టు అజ్ఞానమనే అంధకారాన్ని జ్ఞానం తొలగించి వేస్తుంది. జ్ఞానం వలన తేజస్సు పెరుగుతుంది ... ఇతరులకు సరైన మార్గాన్ని సూచించే శక్తి కలుగుతుంది.

ఇక జీవితం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగిపోవడానికి సంపదలు అవసరం. సతమతంచేసే కొన్ని సమస్యలను పరిష్కరించే శక్తిని సంపదలు కలిగివుంటాయి. సంతోషాన్ని అందించడంలో సంపద ప్రధానమైన పాత్రను పోషిస్తూ వుంటుంది. సంపదలను అనుభవించాలంటే ఆరోగ్యం అవసరం. ఆరోగ్యం లేనప్పుడు ఎంతటి సంపదలున్నా వాటి వలన ప్రయోజనం వుండదు. అందువలన ఆయుష్షును పెంచే ఆరోగ్యాన్ని అందరూ కోరుకుంటూ వుంటారు.

మారుమూల గ్రామాల్లోని ఆలయాల నుంచి మహాపుణ్యక్షేత్రాల వరకూ ఎవరు ఎక్కడికి వెళ్లినా, ఆ భగవంతుడిని కోరుకునేవి ఇవే. సాధారణంగా ఎవరికి వాళ్లు తాము వున్న పరిస్థితులను బట్టి తమకి అవసరమైనవి కోరుతుంటారు. ఇక వీటన్నిటిని కలిపి అందించేదిగా 'పాదరస శివలింగం' చెప్పబడుతోంది.

అనునిత్యం పాదరస శివలింగాన్ని పూజించడం వలన, జీవితాన్ని ప్రభావితం చేసే జ్ఞానం ... సంపద ... ఆరోగ్యం .. ఆయుష్షు ... మానసిక ప్రశాంతత ఇవన్నీ కూడా లభిస్తాయి. అందువలన అనునిత్యం పాదరస శివలింగాన్ని పూజిస్తూ వుండాలి. ఆ పరమశివుడి అనుగ్రహాన్ని పరమ సంతోషంగా స్వీకరించాలి.


More Bhakti News