దురాశకి దూరంగా ఉండటమే మంచిది
ఆశకి అంతులేదు ... దురాశకి సుఖం లేదు అనే మాటను పెద్దలు అనుభవపూర్వకంగా సెలవిచ్చారు. అయితే ఎవరూ కూడా తమ ఆశను ... అత్యాశ అంటే ఒకపట్టాన ఒప్పుకోరు. ఎవరి ఆశ అయినా ఒక దానిపై స్థిరంగా వుండదు. అది ఒక దానిపై నుంచి మరొక దానిపైకి మారిపోతూనే వుంటుంది. ఒక వస్తువును దక్కించుకోవాలనే ఆశ .. ఆ వస్తువు లభించడంతో తీరదు. ఈ సారి మనసు మరోవైపు వెళుతుంది. అంతకన్నా విలాసవంతమైనది ... ఖరీదైనది కావాలనిపిస్తూ వుంటుంది. దానిని సొంతం చేసుకోవడం కోసం ఎన్ని కష్టాలైనా పడాలనిపిస్తుంది.
ఇలా ఆశ అనేది మనిషిని కుదురుగా ఉండనీయదు. నిద్రాహారాలు మానేసి ఆరోగ్యాన్ని పాడుచేసుకుని మరీ ఆశని నెరవేర్చుకుంటే, పగలు తరువాత చీకటి వచ్చినట్టు ... పౌర్ణమి తరువాత అమావాస్య వచ్చినట్టు మరో ఆశ మనసులో పుడుతూనే వుంటుంది. అక్కడి నుంచి మళ్లీ ఆరాటం మొదలవుతూనే వుంటుంది. ఆశ అనేది సాధ్యాసాధ్యాలను బట్టి నెరవేరుతూ వుంటుంది. స్థాయిని దాటి అత్యాశకిపోతే లేని ఆనందం కలగకపోగా వున్న ఆనందం ఆవిరైపోతుంది. అందుకే దురాశ దుఃఖానికి చేటు అనే నీతి వాక్యం అనేక సందర్భాల్లో వినిపిస్తూ వుంటుంది.
ఇలా ఆశనిరాశల మధ్య ఊగిసలాట కొంతమందిలో మాత్రమే కనిపిస్తూ వుంటుంది. మరికొంతమంది దురాశకి దూరంగా వుంటారు. ఇంతవరకూ ఇచ్చినది భగవంతుడే ... ఇకముందు ఇవ్వబోయేది కూడా ఆయనే అన్నట్టుగా వాళ్లు వ్యవహరిస్తారు. ఎవరి అర్హతను బట్టి వాళ్లకి ఎప్పుడు ఏది సమకూర్చాలో భగవంతుడికి తెలుసు ... ఈలోగా ఆరాటమెందుకన్నట్టుగా వుంటారు. ఇలాంటి వాళ్లు తమ ఆశ నెరవేరకపోయినా పెద్దగా బాధపడరు. ఎందుకంటే తమకీ ... ఆశకి మధ్య ఇక్కడ భగవంతుడు వున్నాడు.
ఆశను నెరవేర్చుకోవడానికి ఎవరి పరిధిలో వాళ్లు ప్రయత్నించడంలో తప్పులేదు. అయితే తమది ఆశనా ... అత్యాశనా? అనే విషయంలో స్పష్టత వుండాలి. ఆశ అనేది ఎంత ధృడంగా వుంటుందో ... అది నెరవేరకపోవడం వలన కలిగే నిరాశ కూడా అంతే బలంగా వుంటుందని గ్రహించాలి. ఇక ప్రయత్నమైతే చేశాం ... ఫలితం భగవంతుడి చేతిలో వుందనే విశ్వాసాన్ని కలిగి వుండాలి. అప్పుడు ఆశ నెరవేరితే ఆనందం కలుగుతుంది. ఒకవేళ నెరవేరకపోయినా అసంతృప్తి మాత్రం కలగదు.