ఫాల్గుణ పౌర్ణమి రోజున లక్ష్మీదేవి ఆరాధన
ఎవరైనాసరే తమ జీవితం సిరిసంపదలతో ... సుఖసంతోషాలతో సాగిపోవాలని అనుకుంటారు. తమపట్ల ఆత్మీయానురాగాలను ప్రదర్శించేవారినీ, తమని నమ్ముకుని ఉన్నవారిని ఆ సంపదలతో సంతోషపెట్టాలని ఆశిస్తారు. అవసరాలు ... ఆపదలు వచ్చినప్పుడు ధన సహాయం కోసం ఎవరి దగ్గరికీ పరిగెత్తే అవసరం రాకుండా, పేదరికం కారణంగా నలుగురిలో అవమానాలపాలు కాకుండా వుండాలని కోరుకుంటూ వుంటారు.
అయితే ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి. సంపదలు కలగాలన్నా ... ఆ సంపదలు స్థిరంగా ఉండాలన్నా కావలసింది అమ్మవారి కరుణాకటాక్షాలే. ఆ తల్లి కటాక్షం ఎప్పుడూ అవసరమే కనుక, అనునిత్యం అంకితభావంతో పూజిస్తూనే వుంటారు. అయితే విశేషమైన రోజుల్లో అమ్మవారిని సేవించడం వలన లభించే ఫలితం కూడా మరింత విశేషంగానే వుంటుందని చెప్పబడుతోంది.
అమ్మవారి మనసు గెలుచుకునే విశేషమైన రోజుల్లో ఒకటిగా 'ఫాల్గుణ పౌర్ణమి' చెప్పబడుతోంది. ఈ రోజున అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించాలి. షోడశ ఉపచారాలతో పూజించి, ఆ తల్లికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించాలి. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ప్రసాదించే 'కనకధార స్తోత్రం' పఠించాలి. ఈ విధంగా అమ్మవారిని సేవించడం వలన దారిద్ర్యం నశించి సకల సంపదలు కలుగుతాయనీ, ఆ ఇల్లు అనేక శుభాలకు నిలయంగా వెలుగొందుతుందని చెప్పబడుతోంది.