అలాంటి పరీక్షల్లో నుంచే మహిమలు పుట్టాయి !
భక్తులను పరీక్షించే భగవంతుడు కూడా కొన్ని సందర్భాల్లో పరీక్షలు ఎదుర్కోవలసి వచ్చింది. అలాగే తమపట్ల భక్తులకు గల విశ్వాసాన్ని పరీక్షించే సద్గురువులు కూడా ఒక్కోసారి పరీక్షలను ఎదుర్కోవలసి వచ్చింది. అలాంటి పరీక్షలను వాళ్లు ఎదుర్కొన్న తీరు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఆ సంఘటనలు వాళ్లు చూపిన మహిమలుగా భక్తులు ఇప్పటికీ చెప్పుకుంటూ వుంటారు.
బాబా శిరిడీలోని మశీదులో వున్నప్పుడు, రాత్రివేళలో మశీదులో దీపాలు పెడుతూ ఉండేవాడు. అది ఇష్టంలేని కొందరు ఆయనకి ఆ ఊర్లో నూనె పుట్టకుండా చేస్తారు. తాము నూనె ఇవ్వకపోతే బాబా దీపాలు ఎలా వెలిగిస్తాడో చూడాలని అనుకుంటారు. నీటితో దీపాలు వెలిగించిన బాబా వాళ్ల అహంభావాన్ని ఆర్పేస్తాడు.
ఇక గురువుకి ఎలాంటి శక్తులు ఉండవనీ, ఒకవేళ వుంటే మోడువారిపోయిన చెట్టుని చిగురింపజేయమని ఒక వ్యక్తి రాఘవేంద్రస్వామితో సవాలు విసురుతాడు. రాఘవేంద్రస్వామి తన కమండలంలోని నీళ్లు ఆ మోడుపై చిలకరించగా అది చిగురిస్తుంది. ఆ వ్యక్తిలోని అజ్ఞానం నశిస్తుంది. ఇలా పరీక్షను ఎదుర్కొన్న గురువులలో 'మాణిక్య ప్రభువు' కూడా కనిపిస్తాడు.
ఒక శ్రీమంతుడు మాణిక్య ప్రభువును అతని శిష్యగణంతో సహా భోజనానికి పిలుస్తాడు. మాణిక్యప్రభువు మాంసాహారాన్ని స్వీకరించడని తెలిసికూడా ఆ శ్రీమంతుడు దానినే ఏర్పాటుచేస్తాడు. మాణిక్యప్రభువుకి ఎలాంటి శక్తులు లేవని నిరూపించడం కోసమే అతను ఆ ఏర్పాటు చేశాడనే విషయం అక్కడున్న కొంతమందికి ముందుగానే తెలుసు.
తామంతా భోజనానికి సిద్ధంగా ఉన్నామనీ ... వడ్డన మొదలుపెట్టమని అంటాడు మాణిక్య ప్రభువు. మాంసాహారాన్ని ఉంచిన పాత్రలను వాళ్ల దగ్గరికి తీసుకు వెళ్లి వడ్డించబోగా, ఆ పాత్రల్లో శాకాహారం వుండటం చూసి ఉలిక్కిపడతారు. తమ అజ్ఞానాన్ని మన్నించమని కోరతారు. ఇలా ఎంతోమంది సద్గురువులు కొన్ని సందర్భాల్లో పరీక్షలను ఎదుర్కోవలసి వచ్చింది. తమని పరీక్షించాలనుకున్నవాళ్లకి తమదైన పద్ధతిలో సద్గురువులు సమాధానమిస్తూ వచ్చారు. ఆ సంఘటనలు వారు చూపిన మహిమలుగా భక్తుల మనోఫలకంపై నిలిచిపోయాయి.