నడిపించే నావికుడు బాబానే !
సద్గురువుగా శిరిడీ సాయినాథుడు చూపిన లీలావిశేషాలు అన్నీఇన్నీ కావు. తనని విశ్వసించిన భక్తులను కంటికిరెప్పలా కాపాడుకుంటూ వచ్చినతీరు మనకి ఆయనలో కనిపిస్తుంది. అవసరాల్లో వున్నప్పుడు ... ఆపదలో పడినప్పుడు ఆదుకున్నది ఆయనేననే నమ్మకం భక్తుల మాటల్లో వినిపిస్తుంది. అందుకే తమని నడిపించే నాయకుడు ... తీరాన్ని చేర్చే నావికుడు సాయిబాబాయేనని భక్తులు భావిస్తుంటారు.
ఈ కారణంగానే ఈ రోజున ప్రతి గ్రామంలోను శిరిడీ సాయిబాబా ఆలయాలు కనిపిస్తున్నాయి. ఆహ్లాదాన్ని కలిగించే ఆధ్యాత్మిక కేంద్రాలుగా అలరారుతున్నాయి. అలాంటి అనుభూతిని కలిగించే బాబా ఆలయాల్లో ఒకటి 'యాదగిరి గుట్ట'లో కనిపిస్తుంది. నల్గొండ జిల్లా యాదగిరిగుట్ట క్షేత్రానికి సమీపంలో బాబా ఆలయం దర్శనమిస్తుంది. ప్రతి ఒక్కరూ కోరుకునే మానసిక ప్రశాంతత ఈ ఆలయంలో అడుగుపెట్టగానే లభిస్తుంది.
ఇక్కడి బాబా మూర్తి ఎంతో సహజంగా అనిపిస్తూ వుంటుంది. కళ్లు మూసుకుని మనసుతోనే తమ కష్టాలు చెప్పుకునే వాళ్లు కొందరైతే, రెండు చేతులూ జోడిస్తూ కన్నీళ్లతోనే తమ బాధలను తెలుపుకునే వాళ్లు మరికొందరు. గురువారాల్లో ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువగా వుంటుంది. ఇక్కడ అభిషేకం ... అలంకారాలు ... హారతులు భక్తిశ్రద్ధలతో జరుపుతుంటారు. అలాగే బాబా జీవితచరిత్రను పారాయణ చేసే వాళ్లు కనిపిస్తుంటారు.
ఇక్కడ భక్తులలో ఎవరిని కదిలించినా బాబాతో తమకి గల బంధాన్ని గురించి చెబుతుంటారు. ఆయన ఎదుట తాము మనశ్శాంతిగా కూర్చోవడానికి కూడా ఆయనే కారకుడని అంటారు. తాము ఏ పనైనా ఆయన ఆశీస్సులు అందుకునే ఆరంభిస్తామని చెబుతారు. తమకి మంచి జరుగుతుందని బాబా భావిస్తే ఆ పని పూర్తవుతుందనీ, లేదంటే ఆదిలోనే ఆగిపోతుందని అంటారు. ఏది జరిగినా అది బాబా అనుమతితోనే జరిగిందని విశ్వసిస్తామని చెబుతారు. ఇక్కడి బాబాను ఆరాధించి ఆశించిన వాటిని ఆయన నుంచి వరాలుగా పొందినవాళ్లు ఎంతోమంది వున్నారని అంటారు. ఇలా ఈ క్షేత్రం బాబా పట్ల గల అంకిత భావానికీ ... అసమానమైన భక్తికి నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తూ వుంటుంది. ఆయన మహిమలకు నిలయంగా వెలుగొందుతూ వుంటుంది.