అమ్మ మనసుతో ఆలోచించే భగవంతుడు
తల్లి తన పిల్లలందరినీ ఒకేలా ప్రేమిస్తుంది ... ఒకేలా వాళ్ల ఆకలి తీరుస్తుంది. అయితే కొంతమంది పిల్లలు తల్లికి తీరికలేనప్పుడు తమకి దొరికినవి తినేస్తూ వుంటారు. లేదంటే తల్లి వెంటపడి మారాం చేసి మరీ తమకి కావలసినవి తింటుంటారు. ఇక మరికొంతమంది అసలు ఆకలి గురించిన ఆలోచన లేదన్నట్టుగా వుంటారు. తల్లి పెడితేనే తింటారు ... లేదంటే మానేస్తారు.
వేళకి ఏదో ఒకటి కొట్టుకుతినే పిల్లల విషయంలో తల్లి కాస్త ధైర్యంగానే ఉంటుంది. ఇక తాను పెడితేనే తప్ప తినని పిల్లల విషయంలో తల్లి కాస్త ఆందోళన పడుతూ వుంటుంది. తాను ఎక్కడ వున్నా ... ఏం చేస్తున్నా అలాంటి పిల్లలను కనిపెట్టుకునే వుంటుంది. వాళ్లు అడగకపోయినా కావలసినవి సమయానికి సమకూరుస్తూ వుంటుంది.
భగవంతుడు కూడా తల్లి మనసుతోనే భక్తుల గురించి ఆలోచిస్తూ వుంటాడు. భక్తులు భార్యాబిడ్డల గురించిన ఆలోచనచేస్తూ .. తనసేవ చేస్తూ వుంటే భగవంతుడు సంతోషిస్తాడు. అలా కాకుండా తన సేవ తప్ప మరేమీ పట్టని భక్తుల గురించి ఆయన మరింత ఎక్కువగా ఆలోచన చేస్తాడు. అలాంటి భక్తులకు కావలసినవి అందించే బాధ్యతను తనపై వేసుకుంటాడు. ఇందుకు నిదర్శనంగా మనకి 'తుకారామ్' జీవితంలోని ఒక సంఘటన కనిపిస్తుంది.
ఇంట్లోకి అవసరమైన ధాన్యం ... కాయగూరలను గురించి ఎంతమాత్రం ఆలోచన చేయకుండా తుకారామ్ ఆ పాండురంగడి సేవలోనే వుంటాడు. ఉచితంగా వచ్చినది ఏదీ తుకారామ్ స్వీకరించడు కనుక, అతనికి ఎలా సాయపడాలా అని స్వామి ఆలోచిస్తాడు. కొంతకాలం క్రితం తుకారామ్ చేయి మంచిదని కొంతమంది రైతులు తమ పంటపొలాల్లో ఆయన చేత విత్తనాలు చల్లిస్తారు.
దాంతో స్వామి ఆ పంటల నుంచి రెట్టింపు ధాన్యం వచ్చేలా చేస్తాడు. అందుకు కృతజ్ఞతగా ఆ రైతులు కొంత ధాన్యాన్నీ ... కూరగాయలను తుకారామ్ కి అందజేస్తారు. అలా ఆ కుటుంబం ఆకలి బారిన పడకుండా స్వామి కాపాడతాడు. ఇలా తన ధ్యాసలోనే ఉండిపోయే భక్తులకు ఎలాంటి లోటు రాకుండా చూడటం కోసం భగవంతుడు తల్లిలా ఆరాటపడుతూనే వుంటాడు. వాళ్ల అవసరాలను తీరుస్తూ ఆనందపడుతూనే వుంటాడు.