ఇక్కడ ఊయల కడతానంటే చాలట !

ఆదిపరాశక్తి అయిన అమ్మవారు ఒక్కోసారి మానవరూపంలోను జన్మిస్తుందనీ, ఆ తరువాత ఆ శరీరాన్ని విడిచి దేవతగా పూజాలు అందుకుంటుందనే విశ్వాసం అక్కడక్కడా కనిపిస్తూ వుంటుంది. అలాంటి క్షేత్రాలను దర్శించుకునే భక్తుల సంఖ్య కూడా భారీగానే వుంటుంది. ప్రత్యేకతను సంతరించుకున్న అలాంటి క్షేత్రాల్లో ఒకటిగా 'ఉయ్యూరు' కనిపిస్తుంది.

కృష్ణాజిల్లాలో గల ఈ క్షేత్రం మహిమాన్వితమైనదిగా ప్రసిద్ధిచెందింది. అమ్మవారు 'వీరమ్మతల్లి' పేరుతో భక్తులకు దర్శనమిస్తూ ఉంటుంది. కారణజన్మురాలైన ఒక యువతి, కొన్ని కారణాల వలన దేవతగా మారిపోయిందని స్థలపురాణం చెబుతోంది. ఆమె సాక్షాత్తు అమ్మవారి అంశావతారమని భక్తులు విశ్వసిస్తుంటారు. ప్రతి శుక్రవారం ఈ ఆలయాన్ని దర్శించుకునే భక్తులసంఖ్యను చూస్తే, అమ్మవారిపట్ల వారికి గల బలమైన విశ్వాసాన్ని గురించి తెలుస్తుంది. ప్రతి ఏడాది పదిహేను రోజులపాటు జరిగే జాతరను చూస్తే, అమ్మవారి మహిమలు ఎంతగా ప్రభావితం చేస్తున్నాయో అర్థమవుతుంది.

వీరమ్మతల్లిని దర్శించుకున్న భక్తులలో ఎవరు అనుకున్న ప్రకారంగా వాళ్లు మొక్కుబడులు చెల్లిస్తుంటారు. అయితే ప్రధానమైన మొక్కుగా 'ఉయ్యాల ఊపు' కనిపిస్తుంది. సంతానలేమితో బాధపడే స్త్రీలు, తమకి సంతానం కలిగితే ఆ బిడ్డను మొదటిసారిగా ఇక్కడే ఉయ్యాలలో వేసి ఊపుతామని మొక్కుకుంటూ వుంటారు. అమ్మవారి అనుగ్రహాన్ని పొందినవాళ్లు ఈ మొక్కుని చెల్లించుకుంటూ వుంటారు. ఈ మొక్కుని చెల్లించుకునేవారి సంఖ్య ఇక్కడ ఎక్కువగా కనిపిస్తూ వుంటుంది.

ఇక జాతర సమయంలో అమ్మవారు కూడా ఒకరోజు ఉయ్యాల ఊగడం ఇక్కడి విశేషం. ఈ కారణంగానే ఉయ్యాల ఊపు మొక్కు ఈ క్షేత్రంలో ప్రసిద్ధి చెందిందని చెబుతుంటారు. అమ్మవారు ఇక్కడ ప్రత్యక్షంగా కొలువైవుందనీ, అందువల్లనే సంతాన భిక్ష పెట్టమని కోరుకున్నవారెవరికీ నిరాశ కలగదని అంటారు. ఇలా ఈ క్షేత్రంలో అనేక విశేషాలు కనిపిస్తూ ... వినిపిస్తూ వుంటాయి. అందువలన ఇది మహిమాన్వితమైన క్షేత్రంగా భక్తులచే నీరాజనాలు అందుకుంటోంది.


More Bhakti News