అదే ఈ క్షేత్రం యొక్క ప్రత్యేకత !
మానవాళిని ధర్మమార్గంలో నడిపించడానికి శ్రీమన్నారాయణుడు రాముడుగా అవతరించాడు. దుష్టశిక్షణ ... శిష్టరక్షణ చేస్తూ ధర్మాన్ని ఆచరించి చూపించాడు. అవతారపురుషుడైన రాముడు, ధర్మం యొక్క గొప్పతనాన్ని చాటడం కోసం ఒక సాధారణమైన మానవుడిగానే అనేక కష్టనష్టాలను అనుభవించాడు. అందుకే ఆయనని మూర్తీభవించిన ధర్మస్వరూపంగా చెబుతుంటారు.
రాముడు ప్రజల హృదయాలకు ఎంతగానో చేరువయ్యాడనడానికి నిదర్శనంగా, ప్రతి గ్రామంలోను రామాలయం కనిపిస్తూ వుంటుంది. ఇక శ్రీకృష్ణుడు కూడా ధర్మసంస్థాపన కోసమే అవతరించాడు. ధర్మరక్షణ విషయంలో ఎదురవుతోన్న ఆటంకాలను ఆయన తొలగిస్తూ వెళ్లాడు. ఆయన లీలావిశేషాలను తలచుకుని పరవశించిపోని వాళ్లంటూ వుండరు.
ఆ స్వామి ఆలయాలు కూడా ఆయా గ్రామాల్లో దర్శనమిస్తూ వుంటాయి. ఈ నేపథ్యంలో ఒకే క్షేత్రంలో రామాలయం ... కృష్ణాలయం చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. అలాంటి అరుదైన క్షేత్రంగా 'ఉయ్యూరు' కనిపిస్తుంది. కృష్ణా జిల్ల్లా పరిధిలో గల ఈ క్షేత్రంలో ఒకవైపున సీతారాముల ఆలయం ... మరో వైపున రుక్మిణీ సత్యభామ సమేత కృష్ణాలయం కనిపిస్తూ వుంటాయి.
ప్రాచీనవైభవాన్ని ఆవిష్కరించే ఈ ఆలయాలను చూడగానే అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుంది. సువిశాలమైన ప్రదేశంలో ప్రశాంతతకు ప్రతీకగా కనిపిస్తోన్న ఈ ఆలయాలు భక్తుల సందడితో కళకళలాడుతూ కనిపిస్తుంటాయి. శ్రీరామనవమి ... కృష్ణాష్టమి పర్వదినాల్లో ఊరంతా ఆలయ ప్రాంగణంలోనే వుంటుంది. రామకృష్ణులు తమని సదా రక్షిస్తూ ఉంటారనీ, వాళ్ల అనుగ్రహం కారణంగానే తామంతా చల్లగా ఉన్నామని ఇక్కడివాళ్లు చెబుతుంటారు. విశేషమైన పర్వదినాల్లో రామకృష్ణుల వైభవానికి తమవంతు సహాయ సహకారాలను అందిస్తూ, వాళ్ల పాదసేవలో తరిస్తుంటారు.