పరీక్షించి అనుగ్రహించే పరమేశ్వరుడు
ఏ గురువైనా తన శిష్యులందరినీ సమానంగానే చూస్తాడు. విద్యాబుద్ధులు నేర్పించడంలో ఎలాంటి పక్షపాత ధోరణిని అనుసరించడు. అయితే సరైన శిష్యుడిని ఎంపిక చేయాలనుకున్నప్పుడు, కొన్నిపరీక్షలు పెట్టి వాటిలో విజయం సాధించినవారినే ఎంపిక చేస్తుంటాడు. అలాగే పరమేశ్వరుడు కూడా తన కోసం తపస్సుచేసేవారిని పరీక్షించిగాని అనుగ్రహించడు.
తనపై పార్వతీదేవికి గల ప్రేమానురాగాలను, ఆమె మనసులో తనకిగల స్థానాన్ని పరీక్షించిన తరువాతనే ఆయన అనుగ్రహించాడనే ప్రస్తావన మనకి ఆధ్యాత్మిక గ్రంధాలలో కనిపిస్తుంది. ఇక నవవిధ భక్తిమార్గాలలో ఏ మార్గంద్వారా శివుడి కరుణాకటాక్ష వీక్షణాలను పొందాలనుకున్నా, ఆయన పరీక్షలో విజయాన్ని సాధించవలసిందేననడానికి కొన్ని సంఘటనలు నిదర్శనంగా నిలుస్తుంటాయి.
ఒకసారి 'ఉపమన్యుడు' పాలసముద్రం కావాలని పరమశివుడిని కోరుకోవాలనుకుంటాడు. అందుకోసం సదాశివుడిని గురించి కఠోరతపస్సు చేస్తాడు. తనపైగల భక్తిని పరీక్షించడానికి ఆ దేవదేవుడు 'ఇంద్రుడి' రూపంలో వస్తాడు. ఉపమన్యుడి కోరికను తాను తీరుస్తానని చెబుతూ శివుడిని తక్కువచేస్తూ మాట్లాడతాడు.
అంతే ... ఉపమన్యుడు ఆగ్రహావేశాలకి లోనవుతాడు. శివుడు ఇచ్చినది మాత్రమే తాను స్వీకరిస్తానని చెబుతూ, తన ఆరాధ్య దైవాన్ని ఒక్కమాటన్నా ఫలితాన్ని అనుభవించవలసి వస్తుందని హెచ్చరిస్తాడు. తనపట్ల ఉపమన్యుడికిగల విశ్వాసాన్నీ .. అతని భక్తిలోని తీవ్రతను ప్రత్యక్షంగా చూసిన శివుడు నిజరూప దర్శనమిస్తాడు. ఉపమన్యుడి భక్తిని అభినందిస్తూ కోరిన వరాన్ని ప్రసాదిస్తాడు.