ఈ రోజున ఊయలలోని కృష్ణుడిని ఆరాధించాలి

భగవంతుడు ప్రసాదించిన మానవజన్మను తరింపజేసుకోవడానికి తేలికైన మార్గం ఏదైనా వుందీ అంటే, అది ఆ బాలకృష్ణుడి లీలావిశేషాలను తలచుకోవడమే. చిన్నపిల్లల అల్లరి భరించడం అంతతేలికైన విషయం కాదు. అలాంటిది అవతారపురుషుడే చిన్నపిల్లవాడిగా చేసే అల్లరీ ఎవరు మాత్రం భరించగలరు ? అందుకు నిదర్శనంగా యశోదాదేవికి చేరే ఫిర్యాదులే కనిపిస్తుంటాయి.

ఒకవైపున ఇరుగుపొరుగు ఇళ్లలో వెన్నమీగడలు దొంగిలిస్తూ .. అత్తాకోడళ్లకు గొడవలు పెడుతూ ... గోపికలను ఆటపట్టిస్తూ ఆయన చేసిన అల్లరి అంతాఇంతాకాదు. ఇక ఇదే సమయంలో ఆయన గోవులను రక్షించాడు ... గోపాలకులకు రక్షణ కల్పించాడు. వివిధ రూపాల్లో అసురులు చేస్తూ వచ్చిన దాడులను తిప్పికొడుతూ వచ్చాడు.

శ్రీకృష్ణుడు చేసిన అల్లరి అందంగా కనిపిస్తే .. ఆయన చేసిన అసురసంహారం లోకకల్యాణ కారకమవుతూ వచ్చింది. ప్రతి తల్లి తన బిడ్డకు పసితనంలో కృష్ణుడి వేషం వేయకుండగా వుండదు. ఆ వేషంలో ఆ పసిబిడ్డను ఊయలలో వేసి ఊపుతూ సంతోషంతో పొంగిపోతుంది. అలా కృష్ణుడి ప్రతిమను ఊయలలో వుంచి పూజించే రోజు ఒకటుంది .. అదే 'ఫాల్గుణ పౌర్ణమి'.

ధర్మసంస్థాపనార్థం అవతరించిన శ్రీకృష్ణుడిని చిన్నికృష్ణుడిగా ఈ రోజున ఊయలలో వుంచి ఊపుతూ ఆరాధించాలని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఈ కారణంగానే ఈ రోజుని 'డోలా పౌర్ణమి' అని కూడా పిలుస్తుంటారు. ఫాల్గుణమాసంలో పౌర్ణమి వరకూ గల ప్రతిరోజూ శ్రీమహావిష్ణువును సేవించడానికి విశేషమైనవే. ఇక స్వామికి అత్యంత ప్రీతికరమైన ఈ పౌర్ణమి రోజున, చిన్నికృష్ణుడిని ఊయలలో వుంచి ఆరాధించాలని చెప్పబడుతోంది.

ఈ విధంగా చేయడం వలన సమస్త పాపాలు ... దోషాలు నశించి పోతాయి. పాడిపంటలకు ... సిరిసంపదలకు కొదవలేకుండా పోతుంది. ఊయలలోని కృష్ణుడి ప్రతిమను వుంచి ఊపుతూ కీర్తించడం వలన వైకుంఠలోక ప్రాప్తి కలుగుతుందని స్పష్టం చేయబడుతోంది.


More Bhakti News