లక్ష్మీదేవి అనుగ్రహాన్ని అందించే తీర్థం

తిరుమల తిరుపతి భూలోక వైకుంఠంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి స్వామి శ్రీనివాసుడుగా ... వేంకటేశ్వరుడుగా ... బాలాజీగా ... ఏడుకొండలవాడిగా భక్తులను అనుగ్రహిస్తూ వుంటాడు. స్వామివారు కొలువైన ఈ ప్రదేశం సాక్షాత్తు వైకుంఠం నుంచి దిగివచ్చినదిగా చెప్పబడుతూ ఉన్నందువలన, ఈ క్షేత్రంలో అడుగుపెట్టడమే పూర్వజన్మలో చేసుకున్న పుణ్యఫలితంగా భక్తులు భావిస్తుంటారు.

కొండలు ... లోయలు ... వృక్షాలు ... జలపాతాలు ... తీర్థాలతో, ఆహ్లాదాన్ని కలిగించే మనోహరమైన దృశ్యరూపంగా ఈ క్షేత్రం దర్శనమిస్తుంది. ఒకవైపున స్వామివారి లీలావిశేషాలు ... మరోవైపున ఆయన సంకల్పం కారణంగా ఏర్పడిన తీర్థాలు భక్తులకు అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తూ వుంటాయి. అడుగడుగునా పవిత్రతను ఆవిష్కరించే ఈ దివ్యతీర్థాలలో, ప్రతి తీర్థం కూడా తనదైన విశిష్టతను సంతరించుకుని కనిపిస్తుంటుంది.

అలాంటి తీర్థాలలో 'ఫల్గుణి తీర్థం' ఒకటి. పాపనాశానానికి ఈశాన్యభాగంలో గల ఈ తీర్థం, ఎంతో మహిమాన్వితమైనదిగా స్థలపురాణం చెబుతోంది. వశిష్ఠ మహర్షి భార్య అయిన అరుంధతి ఈ తీర్థం దగ్గర తపస్సు చేయగా, ఇందులో నుంచి లక్ష్మీదేవి వచ్చి దర్శనమిచ్చినట్టుగా చెప్పబడుతోంది. అరుంధతి తపస్సుకు మెచ్చి అమ్మవారు దర్శనమిచ్చిన ఆ రోజు .. ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి. అందువల్లనే ఈ తీర్థానికి 'ఫల్గుణి' అనే పేరు వచ్చింది. ప్రతి సంవత్సరం ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి రోజున ఈ తీర్థములో స్నానమాచరించడం వలన మనోభీష్టాలు నెరవేరతాయనీ, లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని అంటారు.


More Bhakti News