అన్నదానం వలన కలిగే ఫలితం

ప్రసిద్ధమైన కొన్ని పుణ్యక్షేత్రాలలో నిత్యం అన్నదాన కార్యక్రమం జరుగుతూ వుంటుంది. వేలాదిగా ఆ క్షేత్రానికి తరలివచ్చే భక్తులు దైవదర్శనం చేసుకున్న అనంతరం అన్నదాన సత్రంలో భోజనం చేసి వెళుతుంటారు. అన్నప్రసాదంగా ఇది పిలవబడుతూ ఉంటుది కనుక, ధనిక .. పేద అనే తేడా లేకుండా అందరూ ఇక్కడ భోజనం చేస్తుంటారు. ఇక భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని కొన్ని క్షేత్రాలలో వారంలో ఒకటి రెండు రోజులు అన్నదానం చేస్తుంటారు.

సాధారణమైన ఆలయాలలో పర్వదినాల్లో మాత్రమే అన్నదాన కార్యక్రమం జరుగుతూ వుంటుంది. ఏ దానమైనా చేస్తే అది స్వీకరించినవారికి తరువాత ఉపయోగపడుతుంది. కానీ అన్నం .. అప్పటికప్పుడు ఆకలిబాధను తీరుస్తుంది. ఆకలి తీర్చుకున్నవాళ్లు అందించే ఆశీస్సులు జన్మజన్మలపాటు వెంటవస్తాయి. అందుకే అన్ని దానాల్లోకి అన్నదానం ఉత్తమమైనదని చెప్పబడుతోంది.అన్నం పెట్టిన దాతల ఖాతాలోకి ఆ పుణ్యఫలం చేరిపోతూనే వుంటుంది.

ఇక భోజన సమయంలో ఇంటికి వచ్చినవారికి అన్నం పెట్టకుండా పంపించకూడదని పెద్దలు చెబుతుంటారు. ఆకలితో వచ్చినవారికి అన్నం పెట్టడం వలన అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయి. విశేషమైన రోజుల్లో అన్నదానం చేయడం వలన లభించే పుణ్యఫలితం మరింత విశేషంగా ఉంటుందని స్పష్టం చేయబడుతోంది. ముఖ్యంగా ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన మరునాడు ద్వాదశి రోజున చేసే అన్నదాన ఫలితం అనంతమైనదిగా చెప్పబడుతోంది.

ఫాల్గుణ శుద్ధ ఏకాదశి .. 'ఆమలక ఏకాదశి' గా చెప్పబడుతోంది. ఈ రోజున అత్యంత భక్తిశ్రద్ధలతో శ్రీమహావిష్ణువును ఆరాధిస్తూ ఏకాదశి వ్రతాన్ని ఆచరించవలసి వుంటుంది. ఉపవాసంతో కూడిన జాగరణ పూర్తిచేసి, మరునాడు ద్వాదశి ఘడియలు ఉండగానే మరలా స్వామిని పూజించి ప్రీతికరమైన నైవేద్యాలను సమర్పించాలి. ఈ ద్వాదశి రోజున అన్నదానం చేయడం వలన భగవంతుడు ప్రీతిచెందుతాడు. అన్నదానం చేయడం వలన వంశాభివృద్ధి జరుగుతుంది. వాళ్ల పితృదేవతలకు పుణ్యలోకాల్లోకి ప్రవేశం లభిస్తుంది.

ఈ జన్మలోనే కాదు ముందుజన్మలలో కూడా ఆహారానికి వెతుక్కోవలసిన పరిస్థితి అన్నదాతలకు ఏర్పడదని స్పష్టం చేయబడుతోంది. అందుకే అన్నదాన కార్యక్రమాలకు తోచిన సహాయాన్ని అందిస్తూ వుండాలి ... అతిథులను ఆదరిస్తూ వుండాలి.


More Bhakti News