భగవంతుడి రక్షణ ఇలా లభిస్తుంది !

పిండికొద్దీ రొట్టే అనే నానుడి అనేక సందర్భాల్లో వినిపిస్తూ వుంటుంది. అలాగే భగవంతుడి విషయంలో విశ్వాసాన్నిబట్టే ఫలితం లభిస్తుంది. పోతనకు శ్రీరాముడు ప్రత్యక్ష దర్శనమిచ్చాడనీ ... అన్నమయ్య పిలిస్తే వేంకటేశ్వరస్వామి పలికాడనే మాటలు విన్నప్పుడు, ఆ కాలం వేరు ... ఈ కాలం వేరు అని కొంతమంది అంటూ వుంటారు.

గోపన్నను చెర నుంచిరాముడే విడిపించాడనీ, అంధుడైన సూరదాస్ ని చేయిపట్టుకుని కృష్ణుడు నడిపించాడనే ప్రస్తావనవస్తే, అప్పట్లో దేవుడు అలా వచ్చేవాడుగానీ, ఇప్పుడలా రాడు అనే వైఖరిని ప్రదర్శిస్తుంటారు. నిజానికి ఇది కాలానికి సంబంధించిన విషయం కాదు. కాలమేదైనా భగవంతుడిపై భక్తుడికిగల విశ్వాసమే ప్రధానం.

ప్రహ్లాదుడు .. ధృవుడు .. మార్కండేయుడు .. పోతన .. అన్నమయ్య .. రామదాసు .. త్యాగయ్య .. క్షేత్రయ్య .. ఇలా మహాభక్తులను గురించి తెలుసుకుంటే, భగవంతుడిపట్ల వాళ్లకిగల అసమానమైన విశ్వాసం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రహ్లాదుడి విషయాన్నే తీసుకుంటే .. ''అందరినీ రక్షించువాడు ఆ శ్రీహరే !'' .. అనే విశ్వాసానికి కట్టుబడి కనిపిస్తాడు. హిరణ్యకశిపుడు ఎన్నివిధాలుగా బెదిరించినా ... ఎన్నిరకాలుగా హింసించినా తన విశ్వాసాన్ని ఎంతమాత్రం సడలించడు.

అగ్నిగుండంలో తోయిస్తాననీ .. సముద్రంలో పడదోయిస్తానని .. ఏనుగులతో తొక్కిస్తానని .. భయంకరమైన విషసర్పాలచే కాటు వేయిస్తానని హిరణ్యకశిపుడు భయపెట్టినా చలించడు. అన్నీ ఆ శ్రీమన్నారాయణుడి సృష్టిలోనివే అయినప్పుడు తాను భయపడవలసిన పనేముందని హిరణ్యకశిపుడిని అడుగుతాడు. ఆ శిక్షలన్నింటినీ హిరణ్యకశిపుడు అమలుపరచినా ప్రహ్లాదుడు వాటన్నింటి నుంచి సురక్షతంగా బయటపడతాడు. ఆ శ్రీహరి పట్ల అతనికిగల ప్రగాఢమైన విశ్వాసమే అతణ్ణి రక్షిస్తూ వస్తుంది. అందుకే భగవంతుడిని పరిపూర్ణంగా విశ్వసించాలి ... ఆ విశ్వాసంతోనే జీవితాన్ని కొనసాగించాలి ... అప్పుడే ఆ భగవంతుడి రక్షణ లభిస్తుంది.


More Bhakti News