ఇక్కడి నంది విగ్రహం ఇలా కనిపిస్తుందట !
శివుడి వరప్రసాదంగానే నందీశ్వరుడు జన్మించాడు. తన కఠోర తపస్సుచే శివుడిని మెప్పించి ఆయన వాహనంగా వున్నాడు. పరమశివుడిని మోయడమంటే నందీశ్వరుడికి పరమసంతోషం. ఆ స్వామి ఎక్కడ వుంటే అక్కడ ఆయన ఆదేశం కోసం ఎదురుచూస్తూ బుద్ధిగా ఎదురుగానే కూర్చుంటాడు.
మారుమూల గల శివాలయాల నుంచి మహా పుణ్యక్షేత్రాల వరకూ, ఎక్కడ చూసినా గర్భాలయంలోని స్వామికి ఎదురుగా నందీశ్వరుడు దర్శనమిస్తూ వుంటాడు.తను స్వామివారిని చూడకుండా క్షణకాలం ఎవరు అడ్డుగా వచ్చినా ఆయన భరించలేడని అంటారు. అలాంటిది 'తిరుప్పణ్ గూర్' క్షేత్రంలో మాత్రం నందీశ్వరుడు స్వామివారికి ఎదురుగా కాకుండా, కాస్త పక్కకి జరిగినట్టుగా కనిపిస్తుంటాడు. నందీశ్వరుడు ఇలా పక్కకి జరగడం వెనుక ఒక ఆసక్తికరమైన కథనం ఇక్కడ వినిపిస్తూ వుంటుంది.
'నందనార్' అనే ఒక శివభక్తుడు స్వామివారి దర్శనం కోసం ఎంతో దూరం నుంచి వస్తాడు. తనకి ఆలయ ప్రవేశంలేదని తెలిసినా స్వామివారిని దర్శించాలనే ఆరాటంతో, ప్రధానద్వారం బయట నుంచుంటాడు. అక్కడి నుంచే స్వామి దర్శనం చేసుకుందామని ఆయన అనుకుంటే, మధ్యలోగల నంది విగ్రహం అడ్డుగా వుంటుంది. స్వామి దర్శనం లభించనందుకు నందనార్ బాధపడుతూ అక్కడ అలాగే నుంచుండిపోతాడు.
తనని దర్శించాలనే బలమైన సంకల్పంతో వచ్చిన భక్తులను భగవంతుడు ఎప్పుడూ కూడా నిరాశా నిస్పృహలతో వెనుదిరగనివ్వడు. నందనార్ కి తనపైగల భక్తిని గురించి శివుడికి తెలియనిది కాదు. అందుకే ఆయన ఆదేశించినట్టుగా నంది విగ్రహం కొంచెం పక్కకి జరుగుతుంది. దాంతో ఆయనకి శివుడి దర్శనభాగ్యం లభిస్తుంది. మహిమాన్వితమైన ఈ సంఘనకు నిదర్శనంగా ఇప్పటికీ నంది విగ్రహం అలాగే ఉండిపోయిందని చెబుతుంటారు. పరమశివుడు ఇక్కడ ప్రత్యక్షంగా కొలువై ఉన్నాడనీ, నిజమైన భక్తులకు నీలకంఠుడి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుందనేది ఈ యాథార్థ సంఘటన నిరూపిస్తూ వుంటుంది.