అభయమిచ్చి ఆదుకునే ఆంజనేయుడు
సహజంగానే హనుమంతుడు మహాబలశాలి. దేవతల నుంచి అనేక శక్తులను వరాలుగా ఆయన అందుకున్నాడు. అష్టసిద్ధులను తన సొంతం చేసుకున్నాడు. పరాక్రమానికి మించిన వినయ విధేయతలే ఆయనని శ్రీరాముడికి దగ్గర చేశాయి. శ్రీరాముడి పరిచయం జరిగిన దగ్గర నుంచి అనుక్షణం ఆయన గురించే ఆలోచిస్తూ ఆయన సేవలో తరించాడు.
రాముడిని చూడకుండా ... రామనామాన్ని స్మరించకుండా ఆయన క్షణకాలం కూడా ఉండలేడు. అందుకే హనుమంతుడులేని రామాలయం ఎక్కడా కనిపించదు. అలాంటి ఆలయం ఊహకి అందదు కూడా. పరమాత్ముడి సేవయే జీవితానికిగల పరమార్థం అన్నట్టుగా రాముడి పాదాలకు నమస్కరిస్తూ ఆయన కనిపిస్తుంటాడు. రాముడిని సేవించేవాళ్లంతా తన భక్త జనంగా ... బంధుజనంగానే భావిస్తుంటాడు.
అలాంటి హనుమంతుడితో కలిసి సీతారామలక్ష్మణులు పూజాభిషేకాలు అందుకుంటోన్న క్షేత్రం 'నిడుగొండ'లో దర్శనమిస్తుంది. వరంగల్ జిల్లా జనగామ మండలం పరిధిలో ఈ క్షేత్రం అలరారుతోంది. ప్రధాన రహదారి పక్కనేగల ఈ క్షేత్రాన్ని చూడగానే, ఇది ప్రాచీనమైనదనే విషయం అర్థమవుతుంది. ఇక్కడి సీతారాములను భక్తులు తమ ఇలవేల్పుగా భావించి ఆరాధిస్తూ వుంటారు. సీతారాముల ఆశీస్సులు ఎలాంటి లోటు లేని జీవితాన్ని తమకి ప్రసాదిస్తాయని విశ్వసిస్తుంటారు.
ఇక హనుమంతుడి పట్ల ఇక్కడి భక్తులు అపారమైన విశ్వాసంతో కనిపిస్తుంటారు. ఆ స్వామి దర్శనమాత్రం చేతనే ఆయన అభయం లభిస్తుందని అంటారు. గ్రహసంబంధమైన దోషాలు ... అనారోగ్యాలు ... ఆర్ధికపరమైన సమస్యలు ఆ స్వామి దర్శనమాత్రం చేతనే తొలగిపోతాయని అంటారు. అందువలన ఇక్కడి హనుమంతుడు ప్రత్యేక పూజాభిషేకాలను అందుకుంటూ వుంటాడు. హనుమజ్జయంతి ... శ్రీరామనవమితో పాటు ఇతర పర్వదినాల్లోను ఇక్కడ ప్రత్యేక పూజలు ... సేవలు జరుగుతూ వుంటాయి. ఈ సందర్భంగా భక్తులు అటు సీతారాముల ఆశీస్సులను ... ఇటు హనుమంతుడి అభయాన్ని అందుకుని తిరిగి వెళుతుంటారు.