భగవంతుడి లీలావిశేషాలు వింటేచాలు

భగవంతుడి అనుగ్రహాన్ని పొందడానికీ ... ఆయన నుంచి పుణ్యఫలాలను అందుకోవడానికి యజ్ఞయాగాలు ... తపస్సు ... దానధర్మాలు మాత్రమే మార్గమని చాలామంది అనుకుంటూ వుంటారు. వాటిని గురించి తెలియదు ... ఆచరించే శక్తిలేదు కనుక, పుణ్యాన్ని సంపాదించడం కష్టమనే కొందరు అనుకుంటారు. దైవసంబంధమైన కార్యక్రమాలు అక్కడక్కడా జరిగితే, ఇలాంటివి తమలాంటివారికోసం కాదనుకుంటూ తమపని తాము చూసుకుంటూ వుంటారు.

నిజానికి ఇది అమాయకత్వమే ... భగవంతుడిని సేవించడానికి అంతా అర్హులే. ఎవరి అంకితభావాన్నిబట్టి వారిని ఆయన అనుగ్రహిస్తూ వుంటాడు. ఈ విషయంలో ధనిక .. పేద ... పండితులు ... పామరులు అనే భేదం ఆయన ఎంతమాత్రం చూపించడు. భగవంతుడి నామసంకీర్తనం వలన ఎలాంటి పుణ్యఫలాలు లభిస్తాయో, ఆయన గురించిన విషయాలను ... విశేషాలను వినడం వలన కూడా అన్నే పుణ్యఫలాలు దక్కుతాయి.

అందుకే ఎక్కడ భగవంతుడిని గురించిన ప్రవచన కార్యక్రమం జరుగుతూవున్నా అక్కడికి సాధ్యమైనంత వరకూ వెళ్లడానికి ప్రయత్నించాలి. ఆ కార్యక్రమంలో ఎక్కడ కూర్చున్నామని కాకుండా ఏం వినగలిగామనే విషయంపై దృష్టిపెట్టాలి. భగవంతుడి గురించి నాలుగు మాటలు వింటేచాలు .. మనసుకు హాయి కలుగుతుంది. భగవంతుడి లీలావిశేషాలు తెలుసుకుంటూ వుంటే ఏదో లోకంలో విహరిస్తున్నట్టుగా అనిపిస్తుంది.

భగవంతుడు ఎంతటి కరుణామయుడో ... ఆయన పాదాలను ఆశ్రయించి ఇంతవరకూ ఎంతమంది ధన్యులయ్యారో తెలుస్తుంది. జీవితంలో తనది అనుకునే ప్రతీది తనకి ఇచ్చినవాడు భగవంతుడేననీ, తాను నిమిత్తమాత్రుడనని అర్థమవుతుంది. ఈ జన్మను ఇచ్చినదే ఆయన .. అలాంటిది ఆయనని పక్కకి పెట్టి మిగతా పనులు చక్కబెట్టుకోవడం సరైనది కాదనే విషయం స్పష్టమవుతుంది.

ఇక ఆలస్యం చేయకుండా ముందుజన్మలకి అవసరమైన పుణ్యరాశిని సంపాదించుకోవాలని బోధపడుతుంది. నవవిధ భక్తి మార్గాలలో 'శ్రవణం' ఒకటిగా చెప్పబడుతోంది కనుక, భగవంతుడి లీలావిశేషాలను గురించి వింటూ వుండాలి. ఆయన వైభవాన్ని కనులముందు ఆవిష్కరించుకుంటూ తరించిపోవాలి.


More Bhakti News