అదే ఆయన గొప్పతనానికి నిదర్శనం !
బ్రహ్మ మానసపుత్రుడుగా భ్రుగుమహర్షి కనిపిస్తాడు. త్రిమూర్తులలో ఎవరు గొప్పవాళ్లు అనే విషయాన్ని తేల్చుకోవడానికి సైతం వెనుకాడని తపోబలం భ్రుగుమహర్షి సొంతం. అలాంటి భ్రుగుమహర్షికి 'పులోమ' వలన జన్మించినవాడే 'చ్యవనుడు'. ఇతను తల్లిగర్భంలో ఉన్నప్పుడే ఒక అనూహ్యమైన సంఘటన జరుగుతుంది. ఒకసారి ఒక రాక్షసుడు 'పులోమ' ను అపహరించాలని నిర్ణయించుకుంటాడు. భ్రుగుమహర్షి ఆశ్రమంలో లేని సమయంలో అక్కడికి వస్తాడు.
పులోమ గర్భిణి అనే విషయాన్ని కూడా పట్టించుకోకుండా, ఆ రాక్షసుడు వరాహ రూపాన్ని ధరించి ఆమెను తీసుకువెళుతుంటాడు. అతని నుంచి విడిపించుకోవడానికి పులోమ తన శక్తిమేరకు ప్రయత్నిస్తూ వుంటుంది. ఆ సమయంలోనే ఆమె గర్భం నుంచి ఒక మగశిశువు జారిపడుతుంది. అలా కిందపడిన ఆ శిశువు ఒక్కసారిగా కళ్లుతెరిచి వరాహరూపంలో గల ఆ రాక్షసుడి వైపు చూస్తాడు. అంతే ఆ రాక్షసుడు అక్కడే భస్మమైపోతాడు. అంతటి శక్తి సంపన్నుడైన ఆ బాలుడే 'చ్యవనుడు'.
ఆ తర్వాత కాలంలో మహర్షిగా దేవతలచే సైతం ప్రశంసలు అందుకున్న చ్యవనుడి భార్యే 'సుకన్య'. తపోబలం చేత చ్యవన మహర్షి ఎంతటి విశిష్టమైన స్థానంలో కనిపిస్తాడో, పాతివ్రత్యం చేత సుకన్య అంతటి శక్తిమంతురాలిగా కనిపిస్తుంది. అశ్వనీదేవతల విషయంలో దేవేంద్రుడిని సైతం ఎదురించి విజయాన్ని సాధించిన ఘనత ఈ పుణ్యదంపతులకి లభించింది. అన్యోన్యతతో కూడిన ఆదర్శవంతమైన దంపతులుగా సుకన్య - చ్యవన మహర్షి లోకుల హృదయాల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నారు.