అమ్మవారికి ఈ నైవేద్యం ఇష్టమట !

అమ్మవారికి సంబంధించిన కొన్ని క్షేత్రాలకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తుంటారు. ఆ క్షేత్రంలోనే నైవేద్యాన్ని తయారుచేసుకుని అమ్మవారికి ఆనందంగా సమర్పిస్తూ వుంటారు. అమ్మవారికి నైవేద్యాన్ని పెట్టిన తరువాత దానిని ప్రసాదంగా స్వీకరించి వెళుతుంటారు. అలాంటి క్షేత్రాల్లో 'నిదానంపాటి శ్రీలక్ష్మీ' అమ్మవారి క్షేత్రం ఒకటి. గుంటూరు జిల్లా అడిగొప్పులలో ఈ క్షేత్రం విలసిల్లుతోంది. ప్రతి ఆదివారం ఇక్కడ పండుగ వాతావరణాన్ని తలపిస్తూ వుంటుంది. ఎటువైపు చూసినా అమ్మవారి కోసం 'పొంగలి' ని తయారుచేసే భక్తులే కనిపిస్తుంటారు.

అందరూ ప్రేమానురాగాలతో పలకరించుకుంటూ ... అమ్మవారి లీలావిశేషాలను గురించి చెప్పుకుంటూ పొంగలి వంటకం పూర్తి చేస్తుంటారు. అందరూ పొంగలిని మాత్రమే నైవేద్యంగా వండటానికి కారణం, పొంగలి అంటే అమ్మవారికి చాలా ఇష్టమని చెబుతారు. అమ్మవారే స్వయంగా ఈ విషయాన్ని సెలవిచ్చిందని అంటారు. నిదానంపాటి అమ్మవారి అవతరణ వెనుక అద్భుతమైన ... ఆసక్తికరమైన కథనం వినిపిస్తూ వుంటుంది. ఇక్కడి భక్తులలో అమ్మవారిపట్ల గల బలమైన విశ్వాసం కనిపిస్తూ వుంటుంది.

అమ్మవారికి ఆలయం లేకపోవడం, ఆమెతో పాటు ఆవు .. దూడ .. నాగేంద్రుడు పూజలందుకుంటూ ఉండటానికి గల కారణం కథలోనే కనిపిస్తూ వుంటుంది. వేలాదిగా ఇక్కడికి తరలివచ్చే భక్తులు అమ్మవారి అనుగ్రహాన్ని గురించి అనుభవపూర్వకంగా చెబుతుంటారు. అమ్మవారికి ప్రీతికరమైన 'పొంగలి' ని అక్కడే తయారుచేసి నైవేద్యంగా సమర్పించడం వలన, అమ్మవారు సంతోషిస్తుందనీ, ఆమె అనుగ్రహంతో మనసులోని కోరిక అనతికాలంలోనే నెరవేరుతుందని అంటారు.


More Bhakti News