ఈ రోజున నృసింహస్వామిని పూజించాలి

భక్తులను ఆదుకుంటూ బాధల నుంచి వాళ్లకి విముక్తిని కలిగించే బంధువే శ్రీమహావిష్ణువు. తనపట్ల అవమానకరంగా వ్యవహరించినా ఆయన భరిస్తాడుగానీ, తన భక్తులను బాధించాలని చూస్తే మాత్రం ఆయన ఎంతమాత్రం సహించడు. మహాభక్తుడైన ప్రహ్లాదుడి జీవితం ఇందుకు నిదర్శనంగా కనిపిస్తూ వుంటుంది.

హిరణ్యకశిపుడు తన సోదరుడిని సంహరించిన శ్రీమహావిష్ణువును శత్రువుగా భావిస్తూ వుంటాడు. శ్రీమహావిష్ణువుతో తలపడే అవకాశం కోసం ఎదురుచూస్తుంటాడు. హిరణ్యకశిపుడి పుత్రుడైన ప్రహ్లాదుడు, ఈ విషయంలో తన తండ్రి మనసు మార్చడానికి ప్రయత్నించినా ప్రయోజనం లేకపోతుంది. తన భక్తుడైన ప్రహ్లాదుడిని అతను చిత్రహింసలకి గురిచేస్తూ వుండటం సహించలేకపోయిన నారాయణుడు, నరసింహస్వామిగా అవతరించి హిరణ్యకశిపుడిని అంతం చేస్తాడు.

అలా అవతరించిన స్వామి తన భక్తులను అనుగ్రహించడం కోసం, అనేక ప్రాంతాలలో లక్ష్మీసమేతుడై ఆవిర్భవించి వాళ్లతో పూజాభిషేకాలు అందుకుంటున్నాడు. భక్తవత్సలుడైన నరసింహస్వామిని 'ఫాల్గుణ శుద్ధ ద్వాదశి' రోజున పూజించడం ఎంతో మంచిదని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఫాల్గుణ శుద్ధ ద్వాదశి 'నరసింహ ద్వాదశి' గా చెప్పబడుతోంది.

ఈ రోజున నరసింహస్వామిని అత్యంత భక్తి శ్రద్ధలతో ... షోడశ ఉపచారాలతో పూజించి, ప్రీతికరమైన నైవేద్యాలను సమర్పించవలసి వుంటుంది. ఆ స్వామి ఆవిర్భవించిన విశిష్టమైన క్షేత్రాలను దర్శించాలి. అందుకు అవకాశం లేకపోతే దగ్గరలోని నరసింహస్వామి ఆలయాలకు వెళ్లి స్వామి దర్శనం చేసుకోవచ్చు. ఈ రోజున నరసింహస్వామిని పూజించడం వలన పాపాలు ... గ్రహసంబంధమైన దోషాలు ... భయాందోళనలు తొలగిపోయి సకలశుభాలు చేకూరతాయని చెప్పబడుతోంది.


More Bhakti News