దారిద్ర్యాన్ని దహించే దయాశంకరుడు

పూర్వజన్మలో అవకాశం వుండి కూడా దేనినైతే దానం చేయలేదో, ఆ తరువాత జన్మలో దాని లోటు ఏర్పడుతుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. దానధర్మాలు చేయకపోవడం వలన దారిద్ర్యం, పాపలు చేసిన ఫలితంగా అనారోగ్యాలు కలుగుతూ వుంటాయి. దారిద్ర్యమనేది సహనాన్ని పరీక్షిస్తుంది ... సంతోషాన్ని హరించివేస్తుంది. భగవంతుడికి నైవేద్యాన్ని కూడా పెట్టలేని పరిస్థితులను తీసుకువస్తుంది.

తెలియక పాపం చేసినా .. తెలిసి దానం చేయకపోయినా జీవితం అనేక ఇబ్బందులపాలవుతూ అసంతృప్తితో కొనసాగుతూ వుంటుంది. ఇలాంటి కష్టకాలం నుంచి కాపాడేవాడిగా పరమశివుడు కనిపిస్తుంటాడు. ఆ స్వామి దర్శనం వలన ... పూజాభిషేకాలు జరుపుతూ ఉండటం వలన దారిద్ర్యం దహించబడుతుందని చెప్పబడుతోంది. అలా దారిద్ర్యాన్ని దహించే దయాసాగరుడిగా సదాశివుడు కొలువైన క్షేత్రం వరంగల్ జిల్లా హనుమకొండలో కనిపిస్తుంది.

ఇక్కడి 'ఎర్రగట్టు' ప్రదేశంలో స్వామి స్వయంభువుగా ఆవిర్భవించి, ప్రాచీనకాలం నుంచి పూజాభిషేకాలు అందుకుంటున్నాడు. ఎర్రగట్టు స్వయంభువు వేంకటేశ్వరస్వామి క్షేత్రం. గుట్టపై వేంకటేశ్వరుడు స్వయంభువుకాగా ... గుట్ట మధ్య భాగంలో గోవిందరాజస్వామి స్వయంభువు మూర్తిగా కనిపిస్తూ వుంటాడు. ఇక గుట్ట పాదభాగంలో స్వయంభువు శిలగా శివుడు దర్శనమిస్తూ వుండటం ఈ క్షేత్రం యొక్క ప్రత్యేకతగా చెప్పబడుతోంది.

సోమవారాల్లోను ... పర్వదినాల్లోను సదాశివుడిని దర్శించుకునే భక్తుల సంఖ్య ఎక్కువగా వుంటుంది. స్వామి స్వయంభువు కనుక, దర్శనమాత్రం చేత పాపాలు నశిస్తాయని అంటారు. సదాశివుడిని అభిషేకించడం వలన దారిద్ర్యం తొలగిపోయి దుఃఖం దూరమవుతుందని స్పష్టం చేయబడుతోంది. మహాశివరాత్రి పర్వదినాన సదాశివుడి సన్నిధిలో సందడి కనిపిస్తుంది. ఆ తరువాత వచ్చే ఫాల్గుణ శుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని ఇక్కడి వేంకటేశ్వరస్వామి జాతర జరుగుతుంది. ఈ సమయంలో ఎర్రగట్టు భక్తజన సముద్రంలా కనిపిస్తుంది. హరిహరుల ఆశీస్సులతో కోరినవరాలను ప్రసాదిస్తూ వుంటుంది.


More Bhakti News