విష్ణు సహస్రనామ పారాయణ ఫలితం

జగాలనేలే జగన్నాథుడు శ్రీమన్నారాయణుడు. సమస్త లోకాల స్థితిని పర్యవేక్షిస్తూ వుండే పరిపాలకుడు ఆయన. అనేక అవతారాలను ... వివిధ రూపాలను ధరిస్తూ లోక కల్యాణంలో ఆయన ప్రధానమైన పాత్రను పోషిస్తూ వుంటాడు. శ్రీమన్నారాయణుడి లీలావిశేషాలను పరిశీలిస్తే, ఆయన నిండుగా ... నిదానంగా వ్యవహరిస్తూ చాకచక్యంగా పనులు చక్కబెట్టే తీరు కనిపిస్తుంది.

లోకాలను రక్షించడం కోసం ఏ కార్యాన్ని ఎక్కడి నుంచి ఆరంభించాలో ... ఎప్పుడు ముగింపు పలకాలనే పథకరచనలో ఆయనకి తిరుగులేదు. విష్ణుమాయకి విరుగుడులేదు ... ఆయన మాయని తెలుసుకోవడం .. దానిని దాటడానికి ప్రయత్నించడం ఎవరికీ సాధ్యం కాదు. ఆయన చల్లని చూపుల నీడలోనే సమస్త జీవరాశి తన మనుగడను కొనసాగిస్తూ వుంటుంది.

అసాధ్యమనేది ఎరుగని అచ్యుతుడిని ఇంద్రాది దేవతలు ... మహర్షులు ... సదా పూజిస్తుంటారు. ఇక మానవాళి ఆ స్వామిని అనేక విధాలుగా స్తుతిస్తూ ఆయన పాదపద్మాలను ఆశ్రయిస్తూ వుంటుంది. 'ఏకాదశి' వ్రతాలను ఆచరిస్తూ తరిస్తుంటుంది. వీటిలో 'ఆమలక ఏకాదశి' మరింత విశిష్టతను సంతరించుకుని కనిపిస్తూ వుంటుంది. 'ఫాల్గుణ శుద్ధ ఏకాదశి' ఆమలక ఏకాదశిగా చెప్పబడుతోంది. ఆమలక అంటే 'ఉసిరి' అని అర్థం.

ఉసిరిచెట్టును విష్ణుస్వరూపంగా భావించి, ఈ రోజున ఈ చెట్టుకింద ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం జరుగుతూ వుంటుంది. ఈ రోజున ఉపవాస దీక్షను చేపట్టి, భక్తిశ్రద్ధలతో ... నియమనిష్టలతో ఈ వ్రతం చేసుకోవలసి వుంటుంది. శ్రీమహావిష్ణువును కీర్తిస్తూ ... ఆయన లీలావిశేషాలను గురించిన ఆధ్యాత్మిక గ్రంధాలను పఠిస్తూ జాగరణ చేయవలసి వుంటుంది. ఈ రోజున చేసే దానం విశేషమైన పుణ్యఫలాలను అందిస్తుంది. ఇక ఈ రోజున 'విష్ణు సహస్రనామ పారాయణ' చేయడం వలన అనేక పాపాలు ... దోషాలు నశించి సకలశుభాలు చేకూరతాయనీ, ఉత్తమగతులు ప్రాప్తిస్తాయని చెప్పబడుతోంది.


More Bhakti News