అహంభావం వదిలితేనే భగవంతుడి దర్శనం
అహంభావమనేది కొందరిలో మాత్రమే కనిపిస్తూ వుంటుంది. అయితే తమకి అహంభావం ఉందనే విషయాన్నివాళ్లు ఎలాంటి పరిస్థితుల్లోను అంగీకరించరు. అహంభావం కలిగినవాళ్లు తమని తాము గొప్పగా ఊహించుకుంటూ, ఇతరులను తక్కువగా చూస్తుంటారు.
ఎవరైనాసరే తమని గుర్తించాలి ... గౌరవించాలి అనే భావనతోనే వీళ్లు వుంటారు. అలా జరగకపోతే తీవ్రమైన అసహనానికీ ... ఆగ్రహావేశాలకి లోనవుతుంటారు. అయితే అహంభావాన్ని ప్రదర్శించడం వలన ప్రతిఫలంగా లభించేది అవమానం మాత్రమేననే విషయం పురాణాల్లోను కనిపిస్తుంది.
ఒకసారి బృహస్పతితో కలిసి దేవేంద్రుడు శివుడిని దర్శించుకోవడానికి కైలాసానికి బయలుదేరుతాడు. అలా వాళ్లు తమ ప్రయాణాన్ని కొనసాగిస్తూ కైలాసాన్ని సమీపిస్తూ వుండగా ఒక అవధూత తారసపడతాడు. దేవేంద్రుడు ఆ అవధూత దగ్గరికి వెళ్లి .. శివుడు కైలాసంలోనే వున్నాడా ? అని సందేహంగా అడుగుతాడు. అందుకు ఆ అవధూత సమాధానం చెప్పకపోవడం దేవేంద్రుడికి అవమానంగా అనిపిస్తుంది.
తానెవరన్నది తెలియక ఆ అవధూత అలా ప్రవర్తిస్తున్నాడని భావించి, తన శక్తిసామర్థ్యాలను గురించి చెబుతాడు. అయినా ఆ అవధూత పట్టించుకోకపోవడం వలన దేవేంద్రుడు ఆగ్రహావేశాలకి లోనవుతాడు. బృహస్పతి వారిస్తున్నా వినిపించుకోకుండా తన వజ్రాయుధాన్ని అవధూతపై ప్రయోగిస్తాడు. వజ్రాయుధం శక్తిహీనపైపోవడమే కాకుండా, అవధూత కంటి నుంచి వెలువడిన అగ్నిజ్వాలలు దేవేంద్రుడిని వెంటాడసాగాయి. వాటి బారినుంచి తప్పించుకోవడానికి ఆయన నానాతంటాలు పడుతూ గర్వభంగం కావడంతో అవధూతను శరణువేడతాడు. దేవేంద్రుడి గర్వాన్ని అణచడానికి శివుడే ఆ రూపంలో వచ్చాడనే విషయం అప్పటికే బృహస్పతికి అర్థమైపోతుంది.
బృహస్పతి ప్రార్ధనమేరకు అవధూత రూపంలో వున్న శివుడు శాంతించి నిజరూపంలో దర్శనమిస్తాడు. తన అజ్ఞానాన్ని మన్నించవలసిందిగా దేవేంద్రుడు పరమశివుడిని కోరతాడు. అలా దేవేంద్రుడి అహంభావాన్ని తొలగించిన తరువాతనే ఆయనకి శివుడు దర్శనమిస్తాడు. భగవంతుడి సన్నిధికి చేరుకోవాలంటే ముందుగా అహంభావాన్ని వదిలివేయాలనే విషయాన్ని ఈ సంఘటన సూచిస్తూ వుంటుంది.