భక్తుల ఇంటికే నడిచొచ్చిన భగవంతుడు

భగవంతుడు తన భక్తులతో కలిసి ఉండటానికే ఎక్కువగా ఇష్టపడుతూ వుంటాడు. భక్తుల సేవలను స్వీకరిస్తూ ... వాళ్ల కీర్తనలను ఆస్వాదించడంలోనే ఆయన అసలైన ఆనందాన్ని అనుభవిస్తూ వుంటాడు. భక్తుల ఎదుట ప్రత్యక్షమై వాళ్లకి కావలసినవి ఇచ్చి ఆ తరువాత అదృశ్యమైపోవడమే కాదు, తప్పనిసరి పరిస్థితుల్లో ఆ భక్తుల ఇంట్లో ఆయన కొంతకాలం ఉండిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి.

'ఏకనాథుడు' మరాఠీ భాషలోకి భాగవతాన్ని అనువదించే పనికి శ్రీకారం చుడతాడు. ఆ పనిలోపడి ఆయన రోజూ వంటకూడా చేసుకోకపోవడం చూసిన పాండురంగడు, వంటమనిషిగా ఆ ఇంటచేరి సేవలు చేస్తాడు. ఇక భక్తుడైన 'గోరా కుంభార్' చేతులు పోగొట్టుకున్నందు వలన ఆయన జీవనోపాధి దెబ్బతింటుంది. అలాంటి పరిస్థితుల్లో ఆ ఇంట పనివాడిగా చేరిన స్వామి, పరిస్థితులు చక్కబడేవరకూ అక్కడే ఉండిపోతాడు.

ఈ నేపథ్యంలో 'సక్కుబాయి' ని కూడా స్వామి ఇలాగే అనుగ్రహించాడు. పండరీపురం వెళ్లి పాండురంగడి దర్శనం చేసుకోవాలనే ఆరాటం ఆమెలో అంతకంతకూ పెరిగిపోతూ వుంటుంది. అత్తగారు అడ్డుపడుతూ ఉండటంతో నిస్సహాయంగా కుమిలిపోతూ వుంటుంది. అలాంటి పరిస్థితుల్లో స్వామి ఆమె భర్త రూపంలో వచ్చి పండరీపురానికి పంపిస్తాడు. తిరిగి ఆమె వచ్చేంత వరకూ ఆమె రూపంలో ఆ ఇంటి పనులు చేస్తాడు.

ఇలా ఆ స్వామి చూపిన లీలావిశేషాలు అన్నీఇన్నీకావు. ఇలాంటి సంఘటనలన్నీ కూడా భక్తుడికీ ... భగవంతుడికి మధ్యగల అనుబంధానికి అద్దంపడుతూ వుంటాయి. భగవంతుడు ఎంతటి కారుణ్యమూర్తి అనే విషయాన్ని ఆవిష్కరిస్తూ వుంటాయి.


More Bhakti News