అందుకే ఇక్కడ పార్వతీదేవి కనిపించదట !

మోక్షమార్గంలో ప్రవేశించడానికి అవసరమైన అర్హతను పొందడానికిగాను 'శివ' అనే రెండు అక్షరాలను స్మరిస్తేచాలు. ఆ పరమపదాన్ని పొందడానికిగాను ఆయనని దోసెడు నీళ్లతో అభిషేకిస్తేచాలు. అందుకే ఆయనని అంతా భక్తసులభుడు అంటారు. తమపాలిట కామధేనువు ... కల్పవృక్షము ఆయనేనని విశ్వసిస్తూ వుంటారు.

అలాంటి శివుడు వివిధ నామాలతో అనేక ప్రదేశాలలో దర్శనమిస్తూ వుంటాడు. అదే క్షేత్రంలో పార్వతీదేవి కూడా స్వామివారికి తగిన నామాలతో పూజించబడుతూ వుంటుంది. అలా సన్నిధానంలో అమ్మవారు లేకుండా స్వామివారుగానీ, స్వామివారు లేకుండా అమ్మవారు కాని దాదాపుగా కనిపించరు.

అలాంటిది అమ్మవారు లేకుండా స్వామివారు దర్శనమిచ్చే ప్రసిద్ధ క్షేత్రం ఒకటుంది ... అదే 'కోటప్పకొండ'. మహాశివుడు కొలువుదీరిన మహిమాన్వితమైన క్షేత్రాల్లో కోటప్పకొండ ఒకటిగా కనిపిస్తూ వుంటుంది. 'కోటప్పా' అని స్వామిని ప్రేమతో పిలిస్తే చాలు, కొండంత దేవుడు కొవ్వొత్తిలా కరిగిపోయి, వరాల వరదను ప్రవహింపజేస్తాడని భక్తులు విశ్వసిస్తుంటారు.

చాలాకాలం క్రితం ఒక భక్తుడు స్వామివారి సన్నిధిలో అమ్మవారి ఆలయం కూడా వుంటే బాగుంటుందని భావించి ఆలయ నిర్మాణానికి సంకల్పించాడట. ఆ రాత్రి స్వప్నంలో దర్శనమిచ్చిన స్వామి అతణ్ణి వారించాడట. 'సతీదేవి' వియోగం అనంతరం స్వామి ఇక్కడ ధ్యాన నిమగ్నుడై స్వయంభువుగా ఆవిర్భవించాడు. ఇక్కడ పార్వతీదేవి ఆలయ నిర్మాణం జరగకపోవడానికీ, పార్వతీ పరమేశ్వరుల కల్యాణోత్సవం నిర్వహించకపోవడానికి కారణం ఇదేనని స్థలపురాణం చెబుతోంది.


More Bhakti News