సంపదలనొసగే లక్ష్మీశ్రీనివాసుడు
సమస్త సంపదలను ప్రసాదించే లక్ష్మీదేవిని చూడగానే, ఆ ప్రదేశమంతా పవిత్రంగా కనిపిస్తుంది ... మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంది. సాధారణంగా సంపదలు కుదురుగా ఉండనీయవు. అనేక వైపులకు అవి మనసును లాగుతుంటాయి. దాంతో నానాహడావిడి పడిపోవడం చేస్తుంటారు.
అలాంటి సంపదలను క్షణకాలంలో రాసులుగా కురిపించగల అమ్మవారు మాత్రం, నిర్మలంగా ... ప్రశాంతంగా చిరునవ్వులు చిందిస్తూ కనిపిస్తుంది. తన పాదాలను ఆశ్రయించినవారిని అనుగ్రహిస్తూ వుంటుంది. అమ్మవారు యథాలాపంగా చూసినా చాలు ఆ ఇల్లు సిరిసంపదలకు నిలయంగా మారిపోతుంది.
అలాంటి లక్ష్మీదేవిని హృదయంలో నిలుపుకున్నవాడిగా శ్రీనివాసుడు కనిపిస్తుంటాడు. అక్కడ ఉండటమే ఆ తల్లికి సంతోషం ... ఆమెతోనే ఆ స్వామికి వైభోగం. అందుకే శ్రీనివాసుడిని దర్శించినవారికి ఆయన హృదయంలోని లక్ష్మీదేవి దర్శనం కూడా లభిస్తూ వుంటుంది. ఆమెతో కలిసి స్వామి సిరిసంపదలను అనుగ్రహిస్తుంటాడు.
అలా స్వామివారు ... అమ్మవారు కలిసి కొలువైన క్షేత్రాలు అనేక ప్రదేశాల్లో కనిపిస్తూ వుంటాయి. అలాంటి క్షేత్రాల్లో ఒకటి 'ఉంగుటూరు' లో దర్శనమిస్తుంది. కృష్ణా జిల్లా పరిధిలో గల ఈ క్షేత్రం శ్రీనివాసుడి లీలావిశేషాలకు నిలయంగా కనిపిస్తూ వుంటుంది. శ్రీదేవి - భూదేవి సమేతంగా స్వామివారు ఇక్కడ కొలువై వున్నాడు. ఆలయ నిర్మాణం ... గర్భాలయంలోని మూలమూర్తులను చూడగానే ఇది ప్రాచీనమైన క్షేత్రమనే విషయం అర్థమైపోతుంది.
ఇక్కడి భక్తులను కదిలిస్తే, స్వామివారిపట్ల వాళ్లకిగల విశ్వాసం ఎంత బలమైనదనే విషయం స్పష్టమవుతుంది. స్వామివారి మహిమలను తమ అనుభవాలుగా ఆవిష్కరిస్తుంటారు. దారిద్ర్యం వలన బాధపడుతోన్నవాళ్లు స్వామి పాదాలను ఆశ్రయిస్తే చాలు, అనతికాలంలోనే వాళ్ల దుఃఖం దూరమవుతుందని చెబుతుంటారు. శుక్ర .. శనివారాల్లోను, విశేషమైన మాసాల్లోను ... పర్వదినాల్లోను ఈ క్షేత్రానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలివస్తుంటారు. ఆ స్వామికి పూజాభిషేకాలు జరిపిస్తూ తరిస్తుంటారు.