మట్టిలో నుంచి మధురమైన వేణుగానం !

శ్రీకృష్ణుడి లీలావిశేషాలను గురించి ఎంతగా విన్నా తనివితీరదు. పురాణాలు మాత్రమే కాదు, ఆ స్వామి ఆవిర్భవించిన క్షేత్రాలు కూడా ఆయన లీలావిశేషాలను ఆవిష్కరిస్తూ వుంటాయి. అలాంటి విశిష్టమైన క్షేత్రాల్లో ఒకటిగా 'వడ్లమన్నాడు' దర్శనమిస్తుంది. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం పరిధిలో ఈ క్షేత్రం విలసిల్లుతోంది. రుక్మిణీ సత్యభామ సమేతంగా ఏకశిలపై కృష్ణుడు స్వయంభువుగా ఆవిర్భవించడం ఇక్కడి విశేషంగా కనిపిస్తూ వుంటుంది.

స్వామివారు ఆవిర్భవించిన తీరు ఎంతో ఆసక్తికరంగా అనిపించడమే కాకుండా, ఆయన మహిమకు నిలువెత్తు నిదర్శనంగా ఈ క్షేత్రం అలరారుతోంది. చాలాకాలం క్రితం ఈ గ్రామంలోని ఒక భక్తుడి ఇంట్లో గోవులు ఎక్కువగా ఉండేవట. అందువలన వాళ్లకి పాడి ఎక్కువగా వుండేది. వెన్నతీయడం అనే కార్యక్రమం ఆ ఇంట్లో పెద్దఎత్తున జరుగుతూ వుండేది. అలా వాళ్లు వెన్న చిలుకుతూ వున్న సమయంలో ఎక్కడి నుంచో వేణుగానం లీలగా వినిపిస్తూ వుండేది.

ఆ ఇంట్లోని స్త్రీలు ఈ విషయాన్ని గురించి పురుషులకు చెప్పినా కొన్ని రోజులపాటు వాళ్లు పెద్దగా పట్టించుకోలేదు. ఆ తరువాత ఒకసారి వాళ్లు కూడా ఆ వేణుగానాన్ని ఆలకించారు. అంతాకలిసి ఆ వేణుగానం ఎక్కడి నుంచి వస్తుందా అని పరిశీలించడం ప్రారంభించారు. వెన్నచిలుకుతూ వుండే కుండల కిందనుంచి ఆ వేణుగానం వస్తున్నట్టుగా గ్రహించారు. వెన్న కుండలను పక్కకి పెట్టి ఆ ప్రదేశంలో చిన్నగా తవ్వడం ఆరంభించారు.

అలా తవ్వుతున్నాకొద్దీ వేణుగానం యొక్క ధ్వని పెరగసాగింది. అక్కడ రుక్మిణీ సత్యభామ సమేత కృష్ణుడి విగ్రహం కనపడటంతోనే ఆ వేణుగానం ఆగిపోయింది. శ్రీకృష్ణుడు తన ఉనికిని వేణుగానం ద్వారా తెలియజేశాడని భావించిన ఆ కుటుంబసభ్యులు, ఆ ప్రతిమను వెలికితీశారు. అలా వెలుగుచూసిన రుక్మిణీ సత్యభామ సమేత కృష్ణుడికి ఆ తరువాత కాలంలో ఆలయాన్ని నిర్మించారు.

అలా మహిమ చూపుతూనే ఆవిర్భవించిన కృష్ణుడిని భక్తులు తమ ఇలవేల్పుగా భావించి పూజిస్తుంటారు. ప్రతి సంవత్సరం 'కృష్ణాష్టమి' సందర్భంగా ... 'ముక్కోటి ఏకాదశి' సందర్భంగా జరిగే ప్రత్యేక పూజల్లోను ... సేవల్లోను అధిక సంఖ్యలో పాల్గొంటూ వుంటారు. ఇక్కడి స్వామిని దర్శించడం వలన కష్టాలు తీరిపోయి ఆనందకరమైన జీవితం లభిస్తుందని చెబుతుంటారు.


More Bhakti News